ACB Raids | వరంగల్ : ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టుకున్న మహబూబాబాద్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ గౌస్ పాషాకు ఏసీబి షాకిచ్చింది.. ఆయన ఇంట్లో ఈరోజు ఏసీబీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు (ACB Raids) నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు చేశారు.
కురవి రోడ్డులో ఉన్న ఆయన నివాసంతోపాటు మహబూబాబాద్, జమ్మికుంట, హైదరాబాద్‌లోని ఆయన బంధువుల ఇండ్లలోనూ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు . అవినీతి ఆరోపణల దృష్యా ఇప్పటికే ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. గతంతో మహబూబాబాద్‌లో డీటీఓగా పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉంటున్నారు.
సస్పెన్షన్ లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ & మహాబుబాబాద్ జిల్లా రవాణా అధికారి (పూర్తి అదనపు భాధ్యతలు) అయిన మొహమ్మద్ గౌస్ పాషాపై ఏసీబి అధికారులు కేసు నమోదు చేశారు.
అనిశా అధికారులు ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులకు సంబంధించిన 5 చోట్ల వద్ద సోదాలు నిర్వహించి గృహాలు (2), ఓపెన్ ప్లాట్లు (25), వ్యవసాయ భూములు (10.36 ఎకరాలు), వాహనాలు (3) మరియు ఇతర వాటితో సహా రూ.3,51,06,759/- విలువైన (మార్కెట్ విలువ ప్రకారం) స్థిర, చరాస్తులను గుర్తించారు.