Harish Rao : రవీంద్ర భారతిలో ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి అడ్డగోలుగా రాజకీయాలు మాట్లాడారని, బసవేశ్వరుడి జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు.
పదో తరగతి ఫలితాల విడుదలను కూడా తన రాజకీయ అవసరానికి వాడుకున్నారని పది గంటలకు విడుదల చేయాల్సిన ఫలితాలను, రెండు సార్లు సమయం మార్చి చివరకు రెండున్నరకు విడుదల చేశారని, ఫలితాల కోసం ఎదురు చూసే పిల్లల జీవితాలతో వారం రోజులుగా తేదీలు మార్చి, టైమింగ్స్ మార్చి ఆడుకున్నారని ఫైర్ అయ్యారు. విద్యార్థులను ముందు పెట్టుకొని ఎంత నీచంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చారు. రేవంత్ రెడ్డి విద్యార్థులకు చెప్పేది ఇదేనా? అని ప్రశ్నించారు.
విద్యార్థుల మెదళ్లలో విషం నింపుతున్న ముఖ్యమంత్రి ఎక్కడా ఉండడని, రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి రేవంత్ కు నిద్ర పట్టడం లేదని, కళ్లలో, కడుపులో మాత్రమే కాదు నిలువెల్లా విషం నింపుకున్నాడని, కడుపులో పెట్టుకున్న విషాన్ని, ఆపుకోలేక ఈరోజు బయట కక్కాడని అన్నారు.
కేసీఆర్ గురించి అవే చిల్లర మాటలు మాట్లాడారని తెలిపారు. ఇంకా హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ అన్నట్లు కాంగ్రెస్ ముమ్మాటికీ తెలంగాణకు విలనే. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, ఉద్యమం చేసి, రాష్ట్రం ఇచ్చే అనివార్య పరిస్థితిని కాంగ్రెస్ కు కేసీఆర్ కల్పించారు. కేంద్రం మెడలు వంచి సాధించారు. అది ఇచ్చినోళ్ల గొప్పతనమా, సాధించినోళ్ల గొప్పతనమా? రజతోత్సవ సభకు వచ్చిన జనాన్ని చూసి రేవంత్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయినట్లుంది. సిగ్గులేకుండా ఏ పథకం ఆగిపోయిందో చెప్పాలని అడుతున్నారు. కేసీఆర్ కిట్టు, దళిత బంధు, బీసీ బంధు, గొర్రెల పంపిణీ, రెండు నెలల పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లులు, స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ అన్నీ ఆగిపోయాయని హరీష్ రావు (Harish Rao) గుర్తుచేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.