Sarkar Live

Outsourcing Jobs | అంగ‌ట్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు…?

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మెడికల్ కాలేజీలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముతున్న ఏజెన్సీ.. నోటిఫికేషన్ ఉండదు… నిబంధనలు పాటించరు..? ఉద్యోగాల పేరుతో దందా… రంగంలోకి దళారులు 76 పోస్టులను భర్తీ చేసే క్రమంలో కోటికి పైగానే చేతులు మారినట్లు

Outsourcing Jobs
  • ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మెడికల్ కాలేజీలోని ఔట్ సోర్సింగ్
  • ఉద్యోగాలు అమ్ముతున్న ఏజెన్సీ..
  • నోటిఫికేషన్ ఉండదు… నిబంధనలు పాటించరు..?
  • ఉద్యోగాల పేరుతో దందా… రంగంలోకి దళారులు
  • 76 పోస్టులను భర్తీ చేసే క్రమంలో కోటికి పైగానే చేతులు మారినట్లు ఆరోపణలు
  • నిబంధనలకు విరుద్ధంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ

Warangal | సరుకులు కావాలంటే అంగట్లో దొరుకుతాయి. అదే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు (Outsourcing Jobs) కావాలంటే మాత్రం ఆ ఏజెన్సీ వద్ద మాత్రమే దొరుకుతాయని ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదేంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పొందాలంటే సంబంధిత జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి.. అప్పుడే కదా ఔట్ సోర్సింగ్ ఉద్యోగం వస్తుంది అని మీరు భావిస్తున్నారా? మరి వీరేంటి అంగట్లో సరుకులు దొరికినట్లే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ల‌భిస్తాయంటున్నారు? అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అవునండి.. మేము చెప్పేది నిజం.. ఎందుకంటే మీ దగ్గర లక్షో, రెండు లక్షలో ఉంటే సదరు ఏజెన్సీ నిర్వాహకులను కలిస్తే చాలు మీకు ఆ ఉద్యోగం వచ్చినట్లే.. ఇటీవలే ఆ ఏజెన్సీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మెడికల్ కాలేజీలో 76 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను దక్కించుకుందని అదే అదునుగా వసూళ్ల దందాకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది.

ఒక్కో పోస్ట్ కు షాకింగ్ ధ‌ర‌

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవలే ఏర్పాటవుతున్న ఓ మెడికల్ కళాశాలకు ప్రభుత్వం.. గతంలోనే ఓ ఏజెన్సీ కి 20కి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు మంజూరు చేసింది. తర్వాత ఈ మధ్య కాలంలో 76 పోస్టులను మరో ఏజెన్సీకి అప్పగిస్తూ సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా సదరు ఏజెన్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి ఇంటర్వ్యూ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.. కానీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు దక్కించుకున్న సదరు ఏజెన్సీ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండానే ఆ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. 76 పోస్టుల్లో ఒక్కో రకమైన పోస్టుకు ఒక్కో ధర నిర్ణయించి ఇప్పటికే పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో సదరు ఏజెన్సీ సుమారు కోటి రూపాయలకు పైగానే వసూళ్లు చేసినట్లు ఆరోపణలు లేకపోలేదు..


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!