ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీరుపై చెరబండరాజు నగర్ కాలనీ వాసుల ధ్వజం
హన్మకొండ: భద్రకాళి దేవస్థాన మాడ వీధుల అభివృద్ధి పేరుతో గత 23 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న బండ కార్మికుల కుటుంబాలను ఖాళీ చేయించి, బయటి వ్యక్తులకు లబ్ధి చేకూర్చాలని చూడటం దుర్మార్గమని చెరబండరాజు నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్థానికేతరులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు.
ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు ఎమ్మెల్యేను నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధించారు.
ఎమ్మెల్యేకు కాలనీ వాసుల సూటి ప్రశ్నలు:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పట్టా పొంది, అక్కడ నివసించే వారికే ఆ హక్కు వర్తిస్తుంది. కానీ, ఇక్కడ నివాసం లేని వారికి ఏ ప్రాతిపదికన లబ్ధి చేకూరుస్తున్నారు?
కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు, తన అనుచరుల కోసమే ఎమ్మెల్యే ప్రత్యేక జీవోలు తెస్తున్నారా?
మార్పు వస్తుందని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే, ఇప్పుడు స్థానికుల గొంతు కోయడం ఏ రకమైన రాజధర్మం?
బెదిరింపులకు భయపడం
“గత మూడు నెలలుగా మాకు కనీసం తాగునీరు కూడా లేకుండా చేసి ఇబ్బందులకు గురిచేశారు. సమస్య చెప్పుకోవడానికి వెళ్తే.. విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తామని, రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేస్తామని ఎమ్మెల్యే స్వయంగా బెదిరించడం దారుణం. మేము చట్టాన్ని నమ్ముకున్నాము. హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్లను ఆశ్రయించడం వల్లే మాకు తిరిగి తాగునీటి సౌకర్యం లభించింది.” అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
చట్టపరమైన పోరాటం..
ప్రస్తుతం ఈ వ్యవహారంపై తమకు హైకోర్టు స్టేటస్ కో (Status Quo) ఉత్తర్వులు ఉన్నాయని, అలాగే హ్యూమన్ రైట్స్ ఆర్డర్స్ మరియు ఎస్సీ ఎస్టీ కమిషన్ నోటీసులు కూడా ఉన్నాయని కాలనీ వాసులు స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం అభివృద్ధి పేరుతో కక్షపూరిత రాజకీయాలు చేస్తే సహించేది లేదని, ప్రాణాలైనా ఇస్తాం కానీ ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు గాన్నారపు రాజు, బస్కుల కుమార్, రవళి, అనిల్, సునీత, కొమురయ్య, ఎవంజలిన, బాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.








