Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. సోమవారం నుంచి ఈనెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు ఉప సంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్ వచ్చే నెల 11న పోలింగ్, 14న యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. 16వ తేదీన ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగియనుంది. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. సెలవు రోజు మినహా మిగతా రోజుల్లో నామినేషన్ల స్వీకరించనున్నారు. కార్యాలయంలో నేరుగా లేదా ఆన్‌లైన్ విధానంలో దాఖలు చేసే వీలు కల్పించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని అధికారులు వెల్లడించారు.
గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులకు ఒక ప్రతిపాదించే నియోజకవర్గ ఓటరు ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ఇండిపెండెంట్, గుర్తింపు లేని పార్టీ అభ్యర్థులకు 10 మంది నియోజకవర్గ ఓటర్లు ప్రతిపాదించాలని వివరించారు. అభ్యర్థి స్వయంగా లేదా ప్రతిపాదకుల్లో ఒకరు వచ్చి నామినేషన్ దాఖలు చేయవచ్చని వెల్లడించారు. వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నామినేషన్ పత్రాలను అప్‌లోడ్ చేసుకోవచ్చని, క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రిండెట్ హార్డు కాపీని రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందించాలని అధికారులు స్పష్టం చేశారు.
మొదటి రోజు పది నామినేషన్లు
ఉప ఎన్నికకు సంబంధించి సోమవారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజున మొత్తం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 11 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయని నియోజకవర్గ ఎన్నికల అధికారి తెలిపారు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    