- “జయ జయహే తెలంగాణ”తో చరిత్రలో చిరస్మరణీయం
- గొర్ల కాపరి నుంచి కవి వరకు… అనాథ నుంచి డాక్టరేట్ వరకు — అందెశ్రీ ప్రయాణం ఇదే!
Andesri | తెలంగాణ ఆత్మకు కవిత్వం రాసిన గొప్ప కవి అందెశ్రీ (64) ఇక లేరు. ఉదయం ఇంట్లో కుప్పకూలిన ఆయనను కుమారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కష్టాలతో నిండిన బాల్యం
సిద్దిపేట జిల్లా రేబర్తిలో 1961 జూలై 18న జన్మించిన అందె ఎల్లయ్య, సాహిత్య ప్రపంచంలో “అందెశ్రీ”గా పేరు తెచ్చుకున్నారు. తన తల్లిదండ్రులు ఎవరో తెలియని స్థితిలో, అనాథగా పెరిగిన ఆయన కొన్నేళ్లు గొర్రెల కాపరిగా జీవించారు. అయితే అదే సమయం ఆయనలో కవిత్వానికి అంకురార్పణ జరిగిందని తరచుగా చెప్పేవారు.
అందెశ్రీ (Andesri) పాఠశాలకు వెళ్లలేదు. ఎలాంటి చదువు లేకపోయినా, తన కృషి, పట్టుదలతో తెలుగు సాహిత్యంపై అసాధారణమైన పట్టు సాధించారు. ఆయనకు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను కూడా అందుకున్నారు. తెలంగాణ పల్లెల్లో ప్రసిద్ధి చెందిన “మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు” పాటతో ఆయనకు ప్రజల హృదయాల్లో స్థానం దక్కింది.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” పాట ఉద్యమానికి ఊపిరి లాంటిది. ఈ గేయం లేకుండా ఒక్క ఉద్యమ సభా జరగేది కాదు. తరువాత అదే గేయాన్ని తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా ప్రభుత్వం గుర్తించింది.
సినీ గేయ రచయితగా కూడా అందెశ్రీ తన ముద్రవేశారు. 2007లో విడుదలైన “గంగ” చిత్రానికి ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నారు. “ఈ తరం తీర్పు” (విచిత్రం), “చిలకా ఏడున్నది” (ముత్యాల ముగ్గు) వంటి పాటలు ఆయన కవిత్వ గాఢతను చూపిస్తాయి.
అనాథగా మొదలైన ఆయన జీవితం కష్టాలతో నిండినా, గౌరవప్రదమైన స్థాయికి ఎదిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన సేవలకు గాను ప్రభుత్వం రూ. 1 కోటి నగదు పురస్కారం అందించింది. ప్రజల హృదయాల్లో తెలంగాణ కవిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







