Bhogapuram Airport | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఏడు కొత్త ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా విజయనగరం (Vizianagaram) జిల్లాలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం చేపడుతోంది. దీనికి స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు (Alluri Sitarama Raju International Airport) పెట్టారు. ఈ ఎయిర్‌పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొదట ఈ వీటిని 2026 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఇప్పుడు 2026 జనవరి నాటికే పూర్తి చేయాలని నిర్ణయించారు.
Bhogapuram Airport : చంద్రబాబు ప్రభుత్వ సహకారం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ బాధ్యతను జీఎమ్మార్ సంస్థ (GMR Group)కు అప్పగించారు. మొదటి దశలో రూ.4,650 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక సౌకర్యాల కల్పనకు సహకరిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu ) స్వయంగా నిర్మాణ పనులను సమీక్షిస్తున్నారు.
భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు
ఎన్‌హెచ్16 నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రోడ్డు కనెక్టివిటీ కోసం అధికారులు కృషి చేస్తున్నారు. భోగాపురం మండలంలోని వివిధ గ్రామాల్లో 60.08 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో 20.22 ఎకరాల భూమికి సంబంధించిన నిర్వాసితులకు పరిహారం చెల్లించారు. సవరవిల్లి గ్రామంలో 39.86 ఎకరాల భూమిని సేకరించి, 45 మందికి సంబంధించిన రూ.19.89 కోట్ల పరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేశారు. రావాడ, కవులువాడ గ్రామాల్లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం కోసం 3.13 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో, 0.78 ఎకరాల భూమికి సంబంధించిన రూ.47.84 లక్షల పరిహారం చెల్లించారు. మిగిలిన రూ.3.19 కోట్లను త్వరలో చెల్లించాల్సి ఉంది. గత నెలలో ముంజేరు వద్ద ల్యాండ్ పార్శిల్-1 వరకు రోడ్డు నిర్మాణం కోసం 1.11 ఎకరాల భూమిని సేకరించారు. ఈ భూమికి సంబంధించిన రైతులకు రూ.71.25 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంది.
నేషనల్ హైవే నుంచి ట్రంపెట్ నిర్మాణం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బంది హౌసింగ్ కాంప్లెక్స్ కోసం బసవపాలెం వద్ద 24.30 ఎకరాల భూమిని గుర్తించారు. అలాగే, 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణం కోసం 4.50 ఎకరాల భూమిని సేకరించారు. ఈ పనులకు సంబంధించిన రూ.70.21 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. నేషనల్ హైవే నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రంపెట్ నిర్మాణం కోసం 19.75 ఎకరాల భూమిని సేకరించారు. ఈ భూమికి సంబంధించిన రైతులకు రూ.14.43 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. మరిన్ని భూసేకరణల కోసం రూ.22 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు.
ట్రయల్ రన్ పూర్తి చేసిన ఆర్‌డబ్ల్యూఎస్
Bhogapuram Airport విమానాశ్రయం ఫేజ్-1లో నీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యూఎస్ ట్రయల్ రన్ పూర్తి చేశారు. మార్చి తొలి వారం నుంచి రోజుకు 1.7 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేయాలని ప్లాన్ చేశారు. ఫేజ్-2లో నీటి సరఫరా కోసం జీఎమ్మార్ ప్రభుత్వం వద్ద 3.3 ఎల్‌ఎండీ నీటి అవసరాన్ని తెలియజేసింది. ఈ నీటిని తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ నుంచి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధంగా, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







