- భోరజ్ చెక్ పోస్టా..? మజాకా..?
- వసూళ్లు చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులు..? ఏసీబీ రైడ్స్ జరిగినా మారని అధికారులు
- మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కు ఓ లెక్క..?అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కు మరో లెక్క..?
- వ్యవహారాలు చక్కబెడుతున్న సీనియర్ ఎంవీఐ ?
Bhoraj Check Post : ఆ రహదారిపై రోజూ కాసుల వర్షం కురుస్తోందట.. అక్కడ విధులు నిర్వహించే అధికారులు ఆ కాసుల వర్షాన్ని జాగ్రత్తగా ఒడిసిపట్టుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే అక్కడ విధులు నిర్వహించడానికి అధికారులు పోటీపడుతుంటారని సమాచారం.ఆ చెక్ పోస్ట్ లో నెలకు 6 లేదా 7 రోజులు మాత్రమే డ్యూటీ ఉంటుందట, ఒక్క డ్యూటీకే లక్షల రూపాయల మామూళ్లు వస్తాయని ఆరోపణలు ఉన్నాయి.ఆ చెక్ పోస్టులో డ్యూటీ కోసం గత ప్రభుత్వంలో ఒక్కో ఎంవీఐ గరిష్టంగా 15 లక్షల వరకు ముట్టజెప్పారంటే “భోరజ్ చెక్ పోస్టా..?మజాకా…?” చెక్ పోస్ట్ (Bhoraj Check Post ) లో ఇటీవలి కాలంలో రెండు సార్లు ఏసీబీ రైడ్స్ జరిగినా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లలో ఎలాంటి మార్పు రాలేదని వసూళ్లు కొనసాగుతున్నాయని విశ్వసనీయ సమాచారం.
వసూళ్లకు ప్రైవేట్ వ్యక్తులు…
Bhoraj Check Post in Adilabad : ఆదిలాబాద్ లోని అంతరాష్ట్ర చెక్ పోస్ట్ అయినటువంటి భోరజ్ లో వసూళ్ల దందా జోరుగా సాగుతోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో భారీ వాహనాలు రాకపోకలు ఉండడంతో వాహనానికి ఓ రేటు చొప్పున వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ చెక్ పోస్ట్ లో రోజుకు గరిష్టంగా 20 లక్షల వరకు మామ్ముళ్ళ రూపంలో కలెక్షన్ ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.అధికారులు ఎక్కడా కూడా దొరక్కుండా ప్రైవేట్ వ్యక్తుల ద్వారానే వసూళ్లు చేపిస్తున్నట్లు “సర్కార్ వెబ్ సైట్” SPY టీమ్ పరిశీలనలో తేలింది.వాహనాల నుండి వసూళ్లు చేసిన మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తులు అధికారులకు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తారని విశ్వసనీయ సమాచారం.
ఎంవీఐ లు నలుగురు.. ఏఎంవీలు ఆరుగురు..
తెలంగాణ లోనే అతిపెద్ద చెక్ పోస్ట్ అయిన భోరజ్ చెక్ పోస్టులో నలుగురు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు, ఆరుగురు అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒక్కొక్కరు నెలకు 6 లేదా 7 రోజులు మాత్రమే చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తుంటారని సమాచారం. రోజు ఒక మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ తో పాటు ఓ అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ విధుల్లో ఉంటున్నట్లు తెలిసింది. వీరు తమ డ్యూటీ ముగించుకొని వెళ్లే క్రమంలోనే ఎవరి వాటా వారు తీసుకెళ్తారని, వీరు డ్యూటీ నుండి ఇంటికి వెళ్లే సమయంలో వాహనాన్ని కనుక ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తే వసూళ్ల బండారం బయటపడే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతుంది .
Bhoraj Check Post : శ్రీనివాసుడి కనుసన్నల్లోనే…
భోరజ్ చెక్ పోస్టు లో మొత్తం వ్యవహారాలన్నీ సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న శ్రీనివాసుడి కనుసన్నల్లోనే జరుగుతుంటాయని ఆర్టిఏలో జోరుగా ప్రచారం జరుగుతోంది.వసూళ్ల నుండి మొదలుకొని వాటాల వరకు అంతా ఆయన కనుసన్నల్లోనే ఉంటాయని తెలుస్తోంది.ఎవరెవరికి ఎంత మామూళ్లు ముట్టజెప్పాలి, ఉన్నతాధికారులకు నెలకు ఎన్ని ముడుపులు ఇవ్వాలి,ప్రైవేట్ వ్యక్తుల కు ఎంత ఇవ్వాలి తదితర వ్యవహారాలన్నీ కూడా ఈ సీనియర్ ఎంవీఐ నే చూస్కుంటున్నట్లు సమాచారం.ఈ చెక్ పోస్టులో ఏసీబీ అధికారులు ఇప్పటికే రెండుసార్లు దాడులు చేయడంతో అధికారులు భయం భయంగా విధులు నిర్వహిస్తుంటే అంతా నేను చూసుకుంటానని సదరు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ మిగితావారికి అభయమిస్తూ వసూళ్ల దందాను జోరుగా కొనసాగిస్తున్నారని ప్రచారం లేకపోలేదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..