బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది తీర్పును వెలువరించారు. గతంలో 8 మంది ఎమ్మెల్యేల విషయంలో అనుసరించిన నిర్ణయాన్నే పునరావృతం చేస్తూ, వీరిద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చారు.
దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే, కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ ఆయనపై అనర్హత వేటు పడలేదు.
కడియం శ్రీహరి వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె కడియం కావ్యకు మద్దతుగా, కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేసినా ఆయన సభ్యత్వం సురక్షితమని స్పీకర్ తేల్చిచెప్పారు.గతంలో ఇతర ఎమ్మెల్యేల పిటిషన్లను ఏ ప్రాతిపదికన కొట్టివేశారో, అదే తరహాలో వీరిపై దాఖలైన ఫిర్యాదులను కూడా స్పీకర్ తోసిపుచ్చారు.
ప్రతిపక్షాలకు షాక్?
చట్టసభ నిబంధనల ప్రకారం ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతున్న తరుణంలో, స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ తీర్పుతో దానం, కడియం ఇద్దరూ తమ ఎమ్మెల్యే పదవుల్లో కొనసాగడానికి లైన్ క్లియర్ అయింది.








