గీసుకొండ, వరంగల్ జిల్లా: కష్టాల్లో ఉన్న ఉద్యమకారులను ఆదుకోవడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లం బాలకిశోర్ రెడ్డి చాటిచెప్పారు. గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామానికి చెందిన ఉద్యమకారుడు కోట ప్రవీణ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో, అతని వైద్య ఖర్చుల నిమిత్తం బాలకిశోర్ రెడ్డి 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పారిశ్రామికవేత్త అల్లం బాలకిశోర్ రెడ్డి అందుబాటులో లేని కారణంగా, వారి ప్రతినిధిగా గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజకుమార్ స్వయంగా వెళ్లి ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా రాజకుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ఏ కష్టం వచ్చినా బాలకిశోర్ రెడ్డి తోపాటు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో స్పందించి ఆర్థిక సాయం చేసినందుకు గీసుకొండ మండల ఉద్యమకారులు అల్లం బాలకిశోర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.








