BuildNow : కొత్త భవనాలు నిర్మించాలంటే అనుమతులు పొందడం తప్పనిసరి. ఎంతో కీలకమైన ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే వేచి చూడాల్సిందే. ఇలా పర్మిషన్లు పొందడంలో ఆలస్యం కావడం వల్ల భవ నిర్మాణదారులు ఇబ్బంది పడక తప్పని పరిస్థతి. అలాగని ఏమాత్రం లేటు చేయకుండా ఇచ్చే పర్మిషన్లలో పారదర్శకత లోపించేది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు అత్యాధునిక సాంకేతిక విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ‘బిల్డ్‌నౌ’ (BuildNow) అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత యూనిఫైడ్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఈ ప్రక్రియను మరింత వేగంగా, పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిశీలన
భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ముందు చేపట్టాల్సిన పరిశీలన తదితర ప్రక్రియను వేగవంతం చేయడానికి ఏఐ ఆధారిత ఈ బిల్డ్‌నౌ (BuildNow) దోహదపడుతుంది. ఒకే వేదిక కింద అనుమతులన్నింటినీ సమీక్షించి, త్వరితంగా అనుమతులు మంజూరు చేసేలా ఈ యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది.
BuildNow తో ప్రయోజనం ఏమిటి?
ఇకపై భవన నిర్మాణ అనుమతుల కోసం నెలల తరబడి వేచిచూడాల్సిన పనిలేదు. బిల్డ్‌నౌ యాప్ ద్వారా AI ఆధారంగా త్వరితంగా పరిశీలించి, అవసరమైన మార్పులు సూచించి, తక్కువ సమయంలో అనుమతులు మంజూరవుతాయి. ఇంతకుముందు అనుమతుల కోసం అధికారులు, ఇంజనీర్లను కలిసి అనేక దశలు పూర్తి చేయాల్సి వచ్చేది. ‘బిల్డ్‌నౌ (BuildNow) ద్వారా ఒకే వేదికలోనే అన్ని అనుమతులను సులభంగా పొందొచ్చు. సాధారణంగా భవన అనుమతుల ప్రక్రియలో అనేక అనిశ్చిత పరిస్థితులు ఏర్పడతాయి. కానీ, ఈ కొత్త యాప్ ద్వారా నిబంధనలకు అనుగుణంగా ఉంటే అనుమతులు తక్కువ సమయంలోనే మంజూరవుతాయి. భవన నిర్మాణ రంగంలోని ఆర్కిటెక్టులు, ఇంజనీర్లు అనుమతుల కోసం ఎదుర్కొనే సమస్యలను తొలగించి, వారి ప్రాజెక్టులను సులభంగా పూర్తి చేయడానికి ఈ విధానం దోహదపడుతుంది.
BuildNow పై GHMC ప్రత్యేక శిక్షణ
BuildNow విధానంపై ఇంజనీర్లు, ఆర్కిటెక్టులకు అవగాహన కల్పించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రధాన కార్యాలయంలో డెవలప్‌మెంటర్ కంట్రోల్ రూల్స్ (DCR)పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. టెంప్లేట్ల తయారీ, లేయర్ స్ట్రక్చరింగ్, ఎంటిటీ డెవలప్మెంట్ తదితర అంశాలపై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో GHMC అదనపు ముఖ్యనగర ప్రణాళికాధికారులు (Chief City Planners), నగర ప్రణాళికాధికారులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, బిల్డ్‌నౌ యాప్ అభివృద్ధి బృందం సభ్యులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







