చారిత్రక ఖిలా వరంగల్ పెట్రోల్ పంప్ చౌరస్తాలో డా. బి.ఆర్. అంబేద్కర్ తో పాటు సామాజిక విప్లవకారులు మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాల ఏర్పాటుకు బుధవారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరిగింది. కొండా దంపతుల ప్రత్యేక సహకారంతో, విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులు గుడికందుల క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఈ భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో 38వ డివిజన్ కార్పొరేటర్ ఉమా దామోదర్, 39వ డివిజన్ కార్పొరేటర్ సిద్ధం రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు ఏకలవ్య రాష్ట్ర అధ్యక్షులు రాయపురం సాంబయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సంగి ఎలందర్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ మేరుగు అశోక్ తదితరులు హాజరయ్యారు.
మహనీయుల ఆశయాలు స్ఫూర్తిదాయకం
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని, ప్రస్తుతం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పేర్కొన్నారు.మహిళా విద్య కోసం, సామాజిక సమానత్వం కోసం జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాలను భావి తరాలకు అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గడ్డం రవి, వైద్యులు డా. రమేష్, సీనియర్ నాయకులు ఆకుల కుమారస్వామి, ఎనుకంటి రాజు, కొండా అభిమాని నాగవెల్లి రాజన్ బాబు, మహిళా నాయకురాలు కన్నీబోయిన సునీత నిర్మాణ కమిటీ ప్రతినిధులు వడ్డెపల్లి భరత్ (ప్రధాన కార్యదర్శి), మైదం అశోక్, గొర్రె చేరాలు (కోశాధికారి) తదితరులు పాల్గొన్నారు.








