- సుమారు 4 కోట్ల విలువైన ధాన్యం ఎటుపోయినట్లు?
- మాయం చేసారా? రికార్డుల్లో చూపించారా?
Paddy Scam in Hanumakonda | సుమారు 4 కోట్ల విలువైన ధాన్యం ఆ మిల్లులో ఎందుకు కనిపించట్లేదు.నిజంగా ఆ మిల్లు యాజమాన్యం రికార్డుల్లో ఉన్నట్లుగా అంత ధాన్యం దింపుకుందా ?ఒకవేళ ఆ మిల్లుకు అంత ధాన్యం వస్తే సదరు మిల్లులో ఎందుకు లేదు? అసలు ధాన్యం మిల్లులోకి వచ్చిందా?లేదంటే మిల్లులోకి రాకున్నా రికార్డుల్లో చూపించారా?అసలు ఏంజరిగింది అని పౌరసరఫరాల శాఖ లొనే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.ఇదిలా ఉంటే ఇటీవలే హన్మకొండ జిల్లాలో సంచలనం సృష్టించిన “సాంబశివ” మిల్లు వ్యవహారంలో జరిగిన విధంగానే ఇక్కడ కూడా జరిగిందా ?అనే అనుమానాలు వ్యక్తమవుతుండడం గమనార్హం.
Paddy Scam : మాయమైందా? రికార్డుల్లో చూపించారా?
హన్మకొండ జిల్లా పోచారం గ్రామంలో ఉన్న మల్లిఖార్జున స్వామి రైస్ మిల్లుకు 2024-25రబీ సీజన్ లో పౌరసరఫరాల శాఖ 4901 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పంపించినట్లు పౌరసరఫరాల శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.ఆ ధాన్యాన్ని మరాడించి 3283 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆ మిల్లు యాజమాన్యం ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు సదరు మిల్లు యాజమాన్యం ప్రభుత్వానికి సుమారుగా 45 నుండి 50 వరకు ఏసీకేలు(సీఎంఆర్) మాత్రమే పెట్టినట్లు తెలుస్తోంది.ఇంకా 60 కి పైగా ఏసికెలు (సీఎంఆర్) ప్రభుత్వానికి పెట్టలేదని సమాచారం.అసలు విషయం ఏమిటంటే ఆ మిల్లర్ ప్రభుత్వానికి పెట్టాల్సిన బియ్యానికి ,మిల్లులో ఉన్న ధాన్యానికి అసలు పొంతనే లేదని, సుమారు 4 కోట్లు విలువ చేసే ధాన్యం ఆ మిల్లులో లేదని ధాన్యం నిల్వలను చూస్తేనే స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆ మిల్లుకు రికార్డుల్లో పేర్కొన్నట్లుగా 4901 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందా? లేదంటే రాకున్నా రికార్డుల్లో మాయ జరిగిందా అనేది జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకే తెలియాలి.ఆ మిల్లుకు ఏ ఏ సెంటర్ ల నుండి ఎంత ధాన్యం వచ్చింది,ఏ రైతు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం పంపించారు,ఎవరెవరి ఖాతాల్లో ఎన్ని డబ్బులు పౌరసరఫరాల శాఖ జమచేసిందని క్షేత్రస్థాయిలో కనుక ఉన్నతాధికారులు విచారణ చేస్తే మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలోని ఉద్యోగులే గుసగుసలాడుకోవడం గమనార్హం
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







