టిమ్స్ ఆసుపత్రులపై హరీశ్‌రావు ఫైర్:
సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్ (TIMS Hospitals) నెల రోజుల్లోనే ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి నేటితో ఒక నెల పూర్తయ్యిందని మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. ప్రకటించిన తేదీకి ఆసుపత్రి తెరుచుకుంటుందా? లేక ఎప్పటిలాగే కొత్త డేట్ పెట్టేసుకుంటారా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కోతల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సొంత డప్పు కొట్టడం తప్ప, టిమ్స్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొచ్చి సేవలందించడంలో మీరు చేస్తున్న కృషి శూన్యమని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు విమర్శించారు. టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభంపై రెండేళ్లుగా డేట్లు, డెడ్ లైన్లు మార్చడం తప్ప మీరు చేస్తున్నదేం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తే ఓ సినిమాలో తనికెళ్ల భరణి చెప్పే కవిత్వం లాగా చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్లీ.. మళ్లీ అన్నట్లు ఉందని సెటైర్ వేశారు. ప్రభుత్వ భూములను అమ్ముకోవడంలో ఉన్న శ్రద్ధ, ప్రజలకు వైద్య సేవలు అందించే ఆసుపత్రుల మీద లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
సనత్ నగర్, ఆల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రుల (TIMS Hospitals) నిర్మాణ పనుల విషయంలో ప్రభుత్వ జాప్యం చూస్తే నత్త కూడా ఆత్మహత్య చేసుకుంటుందని హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా, కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప కూడా దాటదు అని చెప్పడానికి నగరానికి నలువైపులా పూర్తి కాకుండా ఉన్న టిమ్స్ ఆస్పత్రులే నిదర్శనమని అన్నారు.







