Jubilee Hills Byelection | జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదులు అందజేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ చేస్తోంది. అన్ని వీడియో, ఫోటో ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ కి సమర్పించాం. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ని కోరాం. కొందరు పోలీసులు, ఇతర అధికారులు కాంగ్రస్ పార్టీకి తొత్తులుగా మారిపోయారు. ఈ విషయాలపై సీ విజిల్ యాప్‌లో కూడా ఫిర్యాదులు చేస్తున్నాం. అయితే పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీహిల్స్ ఓటర్లు తెలివైన వారు. తగిన రీతిలో ఆ పార్టీకి గుణపాఠం చెబుతారు. సెన్సిటివ్ పోలింగ్ బూతుల్లో కేంద్ర బలగాలను పెట్టాలని, సెన్సిటివ్ బూత్ వివరాలను కమిషన్ కి సమర్పించాం.
మహిళా పోలీస్ అధికారులను, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లను అక్కడ నియమించి లోపలికి వెళ్లే ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే పోలింగ్ బూత్ లోకి అనుమతించాలని కోరాం. ఓటర్ ఐడీ గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ బూతులకు పంపించొద్దు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఫేక్ ఓటర్ ఐడీలు తయారు చేశారు. ఫేక్ ఐడీ కార్డుల వీడియోను ఇప్పటికే ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించాం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తప్పకుండా అధికారులపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఓటర్లను ప్రభావితం చేసేందుకే సీఎం డ్రామా”
ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలుగా ఆరు గ్యారెంటీలపై సమీక్ష చేయలేదు. ఇప్పుడు ఓటమి భయంతో జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేసేందుకే రివ్యూ చేస్తున్నారు” అన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయాలను “దివాలాకోరు రాజకీయాలు”గా అభివర్ణిస్తూ, “ఎన్ని డ్రామాలు ఆడినా ఓటర్లు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు” అని హరీష్ స్పష్టం చేశారు. యూసుఫ్ గూడలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ఆనుకొని పోలింగ్ బూత్ ఉంది. కాంగ్రెస్ కార్యాలయం పక్కన పోలింగ్ బూత్ ఎలా పెడతారు. దీనికి సంబంధించి కూడా ఆధారాలను ఎన్నికల కమిషషన్‌కు అందజేశాం.
మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. ఎన్నిసార్లు క్యాబినెట్ సమావేశం, అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అయినా ఆరు గ్యారంటీలపై ఏనాడు రివ్యూ చేయలేదు. జూబ్లీహిల్స్ లో ఓటమి భయంతో ముఖ్యమంత్రి మోకాళ్లపై తిరుగుతున్నాడు. ఈరోజు ఆరు గ్యారెంటీలపై ముఖ్యమంత్రి రివ్యూ చేయడం జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేయడమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా జూబ్లీహిల్స్ ఓటర్లు ముందే నిర్ణయించుకున్నారని హరీష్ రావు అన్నారు.







