Kaloji Narayana Rao University Scam | వరంగల్‌లోని ప్రతిష్టాత్మక కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) అవినీతికి, అక్రమాలకు నిలయంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం రాష్ట్ర గవర్నర్‌కు, నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) చైర్మన్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీ కీర్తిప్రతిష్టలు మసకబారుతున్నాయనిఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పీజీ వైద్య పరీక్షల్లో భారీ స్కామ్?
ఇటీవల జరిగిన పీజీ మెడికల్ పరీక్షల ఫలితాలపై హరీష్‌రావు సంచలన ఆరోపణలు గుప్పించారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన ఐదుగురు విద్యార్థులు కేవలం కొన్ని రోజుల్లోనే ఎలా పాస్ అయ్యారని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం రీ-కౌంటింగ్‌కు మాత్రమే అవకాశం ఉందని, కానీ నిబంధనలకు విరుద్ధంగా ‘రీ-వాల్యుయేషన్’ (పునర్ మూల్యాంకనం ) చేసి వారిని ఉత్తీర్ణులను చేశారని ఆరోపించారు. ఈ బాగోతంవెనుక యూనివర్సిటీ (Kaloji Narayana Rao University ) వైస్ ఛాన్సలర్ (VC) కీలక పాత్ర పోషించారని హరీష్‌రావు లేఖలో ఆరోపించారు.
బ్లాంక్ పేజీల్లో సమాధానాలు!
విజిలెన్స్ విచారణలో వెలుగు చూసిన అంశాలను హరీష్‌రావు తన లేఖలో ప్రస్తావించారు. “పరీక్షలు అయిపోయాక, ఆన్సర్ షీట్లలోని క్రాస్ మార్క్ చేసిన ఖాళీ పేజీల్లో విద్యార్థులతో మళ్లీ సమాధానాలు రాయించి, వాటికి ఎక్కువ మార్కులు వేసి పాస్ చేయించారని, ఈ విషయాన్ని స్వయంగా ఓ విద్యార్థి విజిలెన్స్ ముందు ఒప్పుకున్నాడు” అని హరీష్‌రావు గుర్తుచేశారు. ఎన్ఎమ్‌సీ గైడ్‌లైన్స్‌ను, హైకోర్టు ఆదేశాలను వీసీ తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వ పెద్దల హస్తం ఉందా?
ఫెయిల్ అయిన విద్యార్థులంతా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చెందినవారేనని, దీని వెనుక రూ.కోట్ల మేర డబ్బులు చేతులు మారాయనే అనుమానాలు ఉన్నాయని హరీష్‌రావు పేర్కొన్నారు. వీసీ ఇంత అడ్డగోలుగా వ్యవహరిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని, ఆయన వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు : అర్హత లేని వారిని అడ్డదారిలో పాస్ చేయడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని ఎమ్మెల్యే హరీష్‌రావు హెచ్చరించారు. ఎంబీబీఎస్ పరీక్షల్లోనూ మాన్యువల్ మార్కుల సవరణ, సర్వర్ల మార్పు వంటి ఆరోపణలు ఉన్నాయని, తక్షణమే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ నందకుమార్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించాలని గవర్నర్‌ను కోరారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







