Hyderabad Nallakunta Murder Case : నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గుండె తరుక్కుపోయే విషాద ఘటన చోటుచేసుకుంది. క్రిస్మస్ పండుగకు ముందు రోజు (డిసెంబర్ 24) తెల్లవారుజామున ఒక వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా పిల్లల ముందే పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ దారుణ ఘటనలో భార్య మరణించగా, తల్లిని కాపాడుకోవడానికి ప్రయత్నించిన చిన్నారికి గాయాలయ్యాయి.
ప్రేమ వివాహం.. అనుమానంతో వేధింపులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు త్రివేణి (26), నిందితుడు వెంకటేష్ నల్గొండ జిల్లా హుజురాబాద్ నివాసితులు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నరేష్, సాత్విక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా వెంకటేష్ తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను తరచుగా శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేసేవాడు. దీంతో త్రివేణి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయినప్పటికీ, వెంకటేష్ తన ప్రవర్తన మార్చుకుంటానని హామీ ఇవ్వడంతో ఆమె తిరిగి నల్లకుంటలోని తన ఇంటికి వచ్చి ఉంటోంది. అయితే, అతనిలో మార్పు రాకపోగా మరింత క్రూరంగా మారిపోయాడు.
పిల్లల కళ్లముందే దారుణం
గత బుధవారం తెల్లవారుజామున దంపతుల మధ్య మరోసారి తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన వెంకటేష్, త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న తల్లిని చూసి తట్టుకోలేక చిన్నారి సాత్విక ఆమెను కాపాడటానికి యత్నించింది. ఈ క్రమంలో కనికరం లేని తండ్రి, తన కూతురిని కూడా మంటల్లోకి తోసి అక్కడి నుంచ పారిపోయాడు. ఇంట్లో నుండి మంటలు, కేకలు విన్న పొరుగువారు వెంటనే స్పందించి బాధితులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ త్రివేణి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. చిన్నారి సాత్వికకు స్వల్ప గాయాలయ్యాయి, ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. ఈ ఘటన నల్లకుంట ప్రాంతంలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.
నిందితుడి అరెస్ట్
హైదరాబాద్ పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. కేసు నమోదు: భారతీయ న్యాయ సంహిత (BNS), 2023 సెక్షన్ 103 (1) (హత్య) కింద కేసు నమోదు చేశారు. నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు, త్వరలోనే అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన ఇద్దరు పిల్లల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







