Ibomma Piracy Racket | తెలుగు సినీ పరిశ్రమను ఎన్నో సంవత్సరాలుగా వేదిస్తున్న పైరసీ రాకెట్‌ను ఛేదించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ((CP Sajjanar) ) వెల్లడించారు. ఐబొమ్మ (Ibomma) వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)ని అరెస్ట్ చేయడం ద్వారా పరిశ్రమకు ఎంతో ఊరట కలిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే రవిపై ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
సినీ పెద్దలు చిరంజీవి, నాగార్జున, దిల్‌రాజు, సురేశ్ బాబుతో పాటు దర్శకుడు రాజమౌళి సీపీ సజ్జనార్‌తో సోమవారం భేటీ అయ్యారు. అనంతరం సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పైరసీకి సంబంధించి అంతకు ముందు ప్రశాంత్, శివరాజ్‌ను కూడా అరెస్టు చేశామన్నారు. ఇమ్మడి రవి సమాజానికి రెండు రకాలుగా నష్టం కలిగించాడని, పైరసీ (Ibomma Piracy Racket) ద్వారా చిత్రపరిశ్రమకు కోట్ల నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశాడని, దీంతో చాలా మంది డబ్బు, ప్రాణాలు కోల్పోయారని వివరించాఉ.
ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే కొత్త సైట్‌ను తయారు చేశాడని, ఇలా 65 మిర్రర్ వెబ్‌సైట్లు నిర్వహించేవాడని వీసీ సజ్జనార్ తెలిపారు. 21 వేల సినిమాలు అతడి హార్డ్ డిస్క్‌లో ఉన్నాయి. 1972లో విడుదలైన గాడ్‌ఫాదర్ నుంచి మొన్న వచ్చిన ఓజీ వరకు అందులో ఉన్నాయి. పైరసీ ద్వారా రూ.20 కోట్లు సంపాదించాడు. అందులో రూ.3 కోట్లు సీజ్ చేశాం. సైట్‌ను సందర్శించిన వారి డేటా మొత్తం ఇమ్మడి రవి వద్దే ఉంది. ప్రజల డాటాను సైబర్ నేరాల ముఠాలకు అమ్ముకున్నారు. డేటా చోరీ జరగడం వల్ల ప్రజలకు కూడా వేల కోట్ల నష్టం జరిగింది. రవి వద్ద 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా ఉంది. ఇంత డేటా అతడి వద్ద ఉండటం ప్రమాదకరం. దీన్ని సైబర్ నేరగాళ్లు వాడుకునే అవకాశం ఉందన్నారు.
కరేబియన్ పౌరసత్వం… 110 డొమైన్‌లు కొనుగోలు
విశాఖపట్నానికి చెందిన ఇమ్మడి రవి, బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు. నకిలీ పేర్లతో మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొదటి నుంచి నేర ప్రవృత్తితో ఉన్నాడు. సినీరంగం అప్రమత్తమై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడి వెంటపడ్డారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రవి దేశం వదిలి, కరేబియన్ దీవుల్లోని సెయింట్ నేవీ దేశ పౌరసత్వం పొందాడు. 2019 నుంచి ఐబొమ్మను నడుపుతున్నాడు.
అతడి ముఠా 110 డొమైన్‌లు కొనుగోలు చేసి, ఒకటీ బ్లాక్ అయితే మరోటి ఓపెన్ చేసి పైరసీ కొనసాగించినట్లు తెలిపారు. అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్ దేశాల సర్వర్లను వినియోగించాడు. సినిమా హాళ్లలో సీక్రెట్ కెమెరాలతో రికార్డింగ్ చేసి పైరసీ చేశారని, టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా సినిమాల డేటా ట్రాన్స్‌ఫర్ జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు స్వయంగా దర్యాప్తు చేసి రవిని పట్టుకున్నామని, ఎవరైనా సమాచారం ఇచ్చారని వినిపిస్తున్న వార్తలు అబద్ధమని సజ్జనార్ స్పష్టం చేశారు. రవితో పాటు ఉన్న మిగతా నెట్‌వర్క్‌ను కూడా త్వరలో బయటపెడతామని చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







