అంతర్జాతీయ మహిళా దినోత్సవం – మార్చి 8, 2026
Women’s Day 2026 | ఒక మహిళ ఎదుగుదల వెనుక ఎన్నో గాయాలు, మరెన్నో అవమానాలు ఉండవచ్చు. కానీ, వాటన్నింటినీ తట్టుకుని నిలబడినప్పుడే అసలైన నాయకురాలు జన్మిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ కవయిత్రి, సామాజిక కార్యకర్త మరియు మాజీ ఆలేరు ఏఎంసీ డైరెక్టర్ శ్రీమతి మంజుల పత్తిపాటి గారు తన అంతరంగాన్ని కవితా రూపంలో ఆవిష్కరించారు. ‘మంజుల అనే నేను’ పేరుతో ఆమె రాసిన ఈ కవిత ప్రతి మహిళలోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
మంజుల అనే నేను
గాయాల్ని గుండెల్లో దాచుకుని గర్వంగా నవ్వడం నేర్చుకున్నాను! పడిపోతూ కూడా నిలబడటం నేర్చుకున్నాను!
నిశ్శబ్దంగా కనిపించినా నిర్ణయాల్లో గర్జించే శక్తిని నేను! నేను మహిళను మాత్రమే కాదు మార్పుకు మొదటి అడుగు నేను!
నన్ను ఆపాలని ప్రయత్నించిన చేతులు ఇప్పుడు నా విజయానికి చప్పట్లు కొడుతున్నాయి! నన్ను ఆపాలని వచ్చిన చీకట్లు ఇప్పుడు నా వెలుగుకే దారి చూపించాయి!
కన్నీరు పొంగిన ప్రతి క్షణం నా గుండెల్లో విప్లవం మేల్కొంటుంది! నన్ను ఆపాలని వచ్చిన ప్రతి మాట ఇప్పుడు నా విజయ గీతంగా మారుతోంది!
నేను వంటింటి పొగ కాదు నిరాశలో ఉన్న మహిళా హృదయాలకు ఆశ నింపి వెలుగుజ్యోతిని వెలిగించాను!
నన్ను అబల అని అన్న వారందరికీ సహనాన్ని ఆయుధంగా మార్చుకొని నాయకురాలిగా దారులు చూపించాను!
ఇల్లు నుంచి దేశం వరకు ప్రతి రంగంలో వెలుగునిచ్చే ప్రతి మగువకు నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ… అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

కవయిత్రి పరిచయం:
శ్రీమతి మంజుల పత్తిపాటి గారు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ నాయకురాలు. గతంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించి, అట్టడుగు వర్గాల సమస్యలపై గళమెత్తారు. తన సాహిత్యం ద్వారా సామాజిక స్పృహను పెంపొందించడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు.
సాటి మహిళ మారితేనే అసలైన ‘మహిళా దినోత్సవం’: కవయిత్రి మంజుల పత్తిపాటి
“మహిళా దినోత్సవాన్ని కేవలం వేడుకగా జరుపుకోవడం కాదు.. సాటి మహిళా పట్ల మన దృక్పథం మారినప్పుడే మహిళకు నిజమైన గౌరవం దక్కుతుంది” అని మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, ప్రముఖ కవయిత్రి మంజుల పత్తిపాటి పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మహిళా లోకానికి ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు.
“ఈ రోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే, ఈ రోజు ప్రతి మహిళా నిజంగా సంతోషంగా జరుపుకుంటుందా? ఒకసారి మనం మనస్ఫూర్తిగా ఆలోచించాలి. చాలా సందర్భాల్లో మహిళకు మహిళే శత్రువుగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాను జీవితంలో ఎదుర్కొన్న కష్టాల విషాన్ని మరో సాటి మహిళపై చిమ్ముతున్నాం. సంతోషంగా ఇంటికి అడుగుపెట్టిన మహాలక్ష్మిని వరకట్న దాహంతో బాధపెట్టి, కన్నీళ్లు పెట్టించే మహిళలు కూడా మన సమాజంలో ఉన్నారు.
గ్యాస్ ఉన్న రోజుల్లో కూడా కట్టెల పొయ్యిపై వంట చేసిన మహిళలు ఉన్నారు. అత్త, ఆడపడుచుల కాళ్లు పట్టి, వాళ్లు పడుకున్న తర్వాతే పడుకున్న మహిళలు ఉన్నారు. నిండు గర్భిణీ అయినా కూడా నీళ్ల బిందెలు మోసిన మహిళలు ఉన్నారు. ఆ కష్టాలన్ని పోవాలి అంటే మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం కాదు ముందుగా మనం మారాలని అని అన్నారు.
నా జీవితంలో కన్నీరు పొంగిన ప్రతి క్షణం నా గుండెల్లో ఒక విప్లవాన్ని మేల్కొలిపింది. ఆ కన్నీరు రుధిరసిరలుగా మారి కవితల రూపంలో మీ ముందుకు వచ్చింది అని అన్నారు. మహిళలకు మగవాడు శత్రువు కాదు. చాలాసార్లు మనకు మనమే శత్రువులమైపోతున్నాం. మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచక విషపు నాగులను తయారు చేస్తున్నాం.
మహిళ నిజంగా సంతోషంగా ఉండాలి అంటే ముందుగా సాటి మహిళ మారాలి. మహిళ మారితే కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది. అప్పుడు మగవారు కూడా మారుతారు అని అన్నారు. అప్పుడు ప్రతి ఇంట్లో… ప్రతి రోజూ… మహిళా దినోత్సవం జరుపుకునే రోజు అవుతుంది.” అని అన్నారు.








