చిత్రదుర్గ : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో గురువారం తెల్లవారుజామున అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి 48 (NH-48)పై ప్రైవేట్ బస్సు – లారీ పరస్పరం (Bus Accident) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో 13 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు నుంచి శివమొగ్గకు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న ‘సీ బర్డ్’ (Sea Bird) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును, ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. హిరియూర్ సమీపంలోని గోర్లాతు గ్రామం వద్ద తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపు వస్తున్న బస్సును ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
మంటల్లో చిక్కుకున్న వాహనాలు ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లో భారీగా మంటలు చెలరేగాయి. బస్సులో గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు తప్పించుకునే లోపే మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మరణించాడు. కాగా 13 మంది మృతిచెందగా, (మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు). బస్సులో ఉన్న 32 మందిలో 21 మందిని రక్షించగా, ఐదు నుండి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని హిరియూర్, చిత్రదుర్గ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అధికారుల పర్యవేక్షణ సమాచారం అందుకున్న వెంటనే నార్త్ ఈస్టర్న్ రేంజ్ ఐజీపీ బిఆర్ రవికాంతే గౌడ, చిత్రదుర్గ ఎస్పీ రంజిత్ కుమార్ బండారు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
కళ్ళముందే మృత్యువు
ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన బస్సు కండక్టర్ మహ్మద్ సలీం మాట్లాడుతూ.. “ప్రమాదం జరిగినప్పుడు నేను నిద్రపోతున్నాను. పెద్ద శబ్దం వినిపించింది, నేను బస్సు నుంచి బయట పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, చాలా భయంకరంగా ఉంది” అని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







