New Tiger Corridor : తెలంగాణ రాష్ట్రంలో పులుల సంరక్షణకు అటవీ శాఖ (forest department) మరో పెద్ద అడుగు వేసింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణలోని కవ్వాల్ (Kawal) టైగర్ రిజర్వ్ వరకు కొత్తగా పులుల కారిడార్ (Tiger Corridor)ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. తద్వారా ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పులుల సంఖ్య సహజ రీతిలో పెరగడమే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించింది.
New Tiger Corridor : పులులు సురక్షితంగా సంచారించాలనే లక్ష్యం
తిప్పేశ్వర్ (Tippeshwar Tiger Reserve in Maharashtra) రిజర్వ్‌లో ఉన్న పులులు జత కోసం ప్రతి సంవత్సరం నవంబరు నుంచి జనవరి మధ్య విపరీతంగా సంచరిస్తూ ఉంటాయి. ఆ సమయంలో అవి ఆదిలాబాద్ అటవీ ప్రాంతాల దిశగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే.. సరైన మార్గం లేకపోవడం, మధ్యలో గ్రామాలు, వ్యవసాయ భూములు, రహదారులు ఉండటం వంటి కారణాలతో పులులకు ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పులులు సురక్షితంగా సంచరించడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లోకి చేరడానికి కారిడార్ ఏర్పాటు చేయాలని అటవీ శాఖ నిర్ణయించింది.
ఏయే ప్రాంతాల మీదుగా New Tiger Corridor వెళ్తుంది?
కొత్త పులుల కారిడార్ బీంపూర్, బోథ్ అలాగే కడమ్ నది పరిసర అటవీ ప్రాంతాల మీదుగా సాగనుంది. ఈ ప్రాంతాలు అడవులతో నిండి ఉండటం, వన్యప్రాణులకు సహజ ఆవాస స్థలాలు ఉండటం వల్ల పులులు ప్రయాణించడానికి ఇది మెరుగైన మార్గంగా అటవీ శాఖ భావిస్తోంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ రిజర్వ్‌లో కొన్నేళ్లుగా పులుల సంఖ్య పెరుగుతోంది. ఆడ పులులు జత కోసం అక్కడ ఉన్న పెద్ద మగ పులులు కొత్త ప్రాంతాలను సహజంగా వెతుకుతుంటాయి. అలాంటి సమయంలో తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ పులులకు అనువైన గమ్యస్థానం అవుతుంది. అందుకే.. కొత్త కారిడార్ రూపకల్పనకు శ్రీకారం చుడుతున్నారు.
కవ్వాల్‌లో స్థానిక పులుల సంఖ్య పెరుగుతుందా?
అటవీ శాఖ అంచనా ప్రకారం పులులు ఈ కారిడార్ ద్వారా తరచుగా కవ్వాల్ రిజర్వ్‌లోకి రావడం ప్రారంభిస్తే కొద్ది కాలంలో అవి అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుంటాయి. రెసిడెంట్ టైగర్స్ (resident tigers) గా ఈ పులులు మారొచ్చు. అంటే, ఆ అటవీ ప్రాంతమే వాటి శాశ్వత నివాసంగా మారే అవకాశం పెరుగుతుంది. కవ్వాల్ రిజర్వ్ ప్రాంతంలో ఆహారం, నీరు, దట్టమైన వన సంపద, పులులు నివసించడానికి అనువైన సహజ వాతావరణం ఉండడం ఈ ప్రక్రియను మరింత సులభతరం కానుంది.
పులుల కదలికలపై నిఘా
పులుల కదలికలను 24 గంటలూ పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా టైగర్ సెల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పులులు ఎక్కడున్నాయి.. ఏ దిశగా కదులుతున్నాయి.. వాటికి ఎక్కడ ప్రమాదం ఉండొచ్చు? తదితర వివరాలను ఓ సిస్టమ్ ద్వారా రియల్‌టైమ్‌లో సేకరిస్తారు. ఇదివరకు పులులు గ్రామాలకు దగ్గరగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవి పశువులపై దాడులు చేసిన ఘటనలు కూడా నమోదయ్యాయి. అలాంటి ప్రమాదాలను నివారించేందుకు ఈ సిస్టమ్ ఎంతో ఉపయోగపడనుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







