Koheda Integrated Market | ముఖ్యమంత్రి దేశంలోనే అత్యాధునిక హంగులతో ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కోహెడ వద్ద నిర్మించేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు ప్రారంభించింది. సూమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద మార్కెట్ ను నిర్మించనుంది. అందులో ఆధునిక వసతులతో కూడిన నిర్మాణాలు, కోల్డ్ స్టోరేజ్ లు, షెడ్లు, విశాలమైన రోడ్లు తదితర సౌకర్యాలతో మార్కెట్ ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు శుక్రవారం డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కోహెడ మార్కెట్ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ వహించి దేశంలో ఒక రోల్ మోడల్ మార్కెట్ ను నిర్మించాలని నిర్ణయించారని సిఎస్ ఈసందర్భంగా తెలిపారు. వారి ఆదేశాల మేరకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సూమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద మార్కెట్ ను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
కొహెడలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ( Koheda Integrated Market) లో ఆధునిక వసతులతో కూడిన నిర్మాణాలు, కోల్డ్ స్టోరేజ్ లు, షెడ్లు, విశాలమైన రోడ్లు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. దేశంలోనే ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా కోహెడ మార్కెట్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని సీఎస్ అన్నారు. రాష్ట్రంలో విస్తారంగా పండే పండ్లు, కూరగాయలు, ఇతర ఉత్పత్తులు, ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ఈ మార్కెట్ ను నిర్మించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మామిడి, బత్తాయి, పండ్ల తోటలు విరివిగా ఉంటాయిని ఆ స్థాయిలో రైతులు, వినియోగదారులకు మార్కెటింగ్ సదుపాయం అందించాలని ముఖ్యమంత్రి సూచించారని అందుకు తగిన విధంగా ప్రణాళికలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Koheda Integrated Market ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.2890 కోట్లు
కోహెడ మార్కెట్ ఏర్పాటుకు సూమారు ప్రాజెక్టు వ్యయం రూ.2890 కోట్లు అవసరమవుతుందని అధికారులు సి.ఎస్ కు తెలిపారు. మౌళిక వసతులు, భూ సేకరణ, రోడ్ల నిర్మాణం, ఆధునిక షెడ్ల నిర్మాణం, సోలార్ రూఫ్ టాప్ ల ఏర్పాటు, కోల్డ్ స్టోరేజ్ ల నిర్మాణం కోసం నిధులు కావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు సరిపడే విధంగా కోహెడ మార్కెట్ ను నిర్మించాలని సిఎస్ కె. రామకృష్ణా రావు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.