ఆదివాసీల స్వయం పాలన, హక్కుల పోరాటంలో తన ప్రాణాలను పణంగా పెట్టిన గొప్ప నాయకుడు, ఆదివాసీ లిబరేషన్ టైగర్స్ వ్యవస్థాపకుడు కుంజ రాము అని పలువురు ఆదివాసీ సంఘాల నేతలు కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని మోకాళ్లపల్లె గ్రామంలో శనివారం కుంజ రాము 22వ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఆయన పుత్రుడు కుంజ సూర్యం సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు మరియు ఆదివాసీ తోటి తెగ నేతలు పాల్గొని రాము చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
రాము ఆశయాలే సీతక్కకు మార్గదర్శకం: కొడప రఘు
ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ తోటి PVTG సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొడప రఘు మాట్లాడుతూ.. ఆదివాసీల అభ్యున్నతి కోసం పరితపించిన కుంజ రాము ఆశయాలను ఆయన సతీమణి, ప్రస్తుత రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) కొనసాగిస్తున్నారని తెలిపారు. ఒక సాధారణ ఆదివాసీ మహిళగా ఉద్యమ బాట నుండి నేడు కేబినెట్ మంత్రిగా ఎదిగి ప్రజాక్షేత్రంలో ఉండటం ఆదివాసీ సమాజానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
పోరాట పంథా – అలుపెరగని ప్రస్థానం
కుంజ రాము రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ.. కామ్రేడ్ ఓంకారమ్మ స్పూర్తితో, పాలడుగు కృష్ణ శిష్యరికంలో ఆయన నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్నారని నేతలు వివరించారు. గిరిజనేతర సమాజం నుండి ఆదివాసీలకు ఎదురవుతున్న ముప్పును ముందే గ్రహించి, విడివిడిగా ఉన్న విప్లవ శక్తులను, కుల సంఘాలను ఏకీకరణ చేయడంలో రాము కీలక పాత్ర పోషించారని స్మరించుకున్నారు. పశువుల కాపరి స్థాయి నుండి స్వయం కృషితో ఇంగ్లీష్‌పై పట్టు సాధించి, సామాజిక బాధ్యత గల నాయకుడిగా ఆయన ఎదిగిన తీరు నేటి తరం యువతకు ఆదర్శమని కొడప రఘు పిలుపునిచ్చారు.
సీతక్కను కలిసే అవకాశం కల్పిస్తాం: కుంజ సూర్యం
మంత్రి సీతక్క ప్రస్తుతం భద్రాచలం పర్యటనలో ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని, త్వరలోనే తోటి తెగ నాయకులతో కలిసి మంత్రిని స్వయంగా కలిసేలా చొరవ చూపుతానని ఆమె కుమారుడు కుంజ సూర్యం నేతలకు భరోసా ఇచ్చారు. తమ తెగ ఎదుర్కొంటున్న సాధక బాధలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఇది మంచి అవకాశమని నేతలు భావించారు.ఈ కార్యక్రమంలో తోటి తెగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోయం సాంబయ్య, తుడుందెబ్బ జాతీయ కార్యదర్శి సోయం రాజేందర్,తోటి తెగ వరంగల్ అధ్యక్షుడు గుర్రం రఘు, ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు సోయం జగదీశ్వర్, ఆత్రం కుమారస్వామి, మాదన్నపేట ప్రధాన కార్యదర్శి కొడప రవి, CPI(ML) న్యూడెమోక్రసీ నర్సంపేట డివిజన్ కార్యదర్శి ఆత్రం వెంకటస్వామి, యువజన సంఘం కో-కన్వీనర్ ఆత్రం ప్రశాంత్, కాంగ్రెస్ నాయకుడు కొడప దిలీప్, సీనియర్ నాయకులు కొడప మహేష్, సోయం రవి, షెడ్మాకి సాయిరాం తదితరులు పాల్గొన్నారు.








