Mallojula Venugopal Rao : మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల రావు అలియాస్ సోను అలియాస్ భూపతి అలియాస్ అభయ్ అడవి బాట వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. బుధవారం తన 60 మంది మావోయిస్టు సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు. సీఎం సమక్షంలో వీరు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మల్లోజుల వేణుగోపాల్, ఆయన బృందాన్ని సీఎం ఫడ్నవీస్ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. దాదాపు మావోయిస్టు పార్టీ రెండో అగ్రస్థానంలో ఉన్న మల్లోజుల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి భారీ నష్టంగా భావిస్తున్నారు.
మరోవైపు మావోయిస్టు పార్టీ వైఖరితో అసంతృప్తి వ్యక్తంచేస్తూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్నారు. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుని విప్లవోద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మల్లోజులపై దాదాపు వందకు పైగా కేసులు కూడా ఉన్నాయి. మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డు ఉన్నట్లు గడ్చిరోలి పోలీసులు ప్రకటించారు. మల్లోజుల లొంగిపోవడంతో 44 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెరపడింది.
కాగా మల్లోజుల వేణుగోపాల్ పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధరమ్మ దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పని చేసిన తండ్రి వేణుగోపాల్, ఆయన రెండో అన్న కోటేశ్వరరావు నుంచి స్ఫూర్తి పొంది.. చదువు పూర్తయిన తర్వాత అన్న పిలుపు మేరకు ఉద్యమంలో ప్రవేశించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    