ఆయుధాలు వీడి ప్రధాన స్రవంతిలోకి – షరతులు వెల్లడి
Maoist Surrender Announcement : సీపీఐ (మావోయిస్ట్)కు చెందిన మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ (MMCSZC) ఒక కీలక ప్రకటన చేసింది. ఈ జోన్ పరిధిలోని మావోయిస్టు కార్యకర్తలు అందరూ జనవరి 1, 2026న ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరనున్నట్లు ఎంఎంసీఎస్‌జెడ్‌సీ అధికార ప్రతినిధి అనంత్ వెల్లడించారు.
ఈమేరకు ఆయన తాజాగా ఒక లేఖను విడుదల చేయడంతో పాటు, మీడియాకు ఆడియో క్లిప్‌లను విడుదల చేశారు.
ప్రభుత్వాలకు లేఖ, నిర్ణయానికి సమయం గతంలో (నవంబర్ 22న) అనంత్… మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మకు లేఖ రాశారు. ఏకాభిప్రాయానికి రావడానికి ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలని ఆ లేఖలో అభ్యర్థించిన విషయం తెలిసిందే.
అయితే, హోంమంత్రి విజయ్ శర్మ రేడియోలో మాట్లాడుతూ నిర్ణయం తీసుకోవడానికి 10 నుండి 15 రోజులు సరిపోతాయని చెప్పినట్లు అనంత్ ఈ తాజా లేఖలో పేర్కొన్నారు. హోంమంత్రి ప్రకటనను తాను గౌరవిస్తున్నానని, కానీ ఇంత తక్కువ సమయం సరిపోదని అనంత్ స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఆయుధాలను వొదులుకుని ప్రధాన స్రవంతిలోకి తిరిగి రావడానికి తాము నిర్ణయించిన తేదీ జనవరి 1, 2026 పట్ల హోంమంత్రికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
లొంగిపోవడం కాదు: షరతులు ఇవే
- మావోయిస్టులు ప్రధాన స్రవంతిలో చేరేందుకు ముందుగా కొన్ని డిమాండ్లను ఉంచారు. ముఖ్యంగా, ఇది సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం మాత్రమేనని, ఇది లొంగిపోవడం కాదని అనంత్ స్పష్టం చేశారు.
- కార్యకర్తలు ఒక్కొక్కరుగా కాకుండా, సామూహికంగా ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలి.
- ప్రభుత్వ చర్యలు నిలిపివేయాలి: మావోయిస్టులు తమ పోరాటాన్ని నిలిపివేస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వాలు కూడా అన్ని రకాల నిర్బంధ కార్యకలాపాలను, అరెస్టులను వెంటనే నిలిపివేయాలి.
- ప్రజలను మోసం చేయడం కాదు: ప్రజలను మోసం చేయడం లేదా ద్రోహం చేయడం తమ ఉద్దేశం కాదని, కానీ ఈ పోరాటానికి ప్రస్తుతం సరైన సమయం కాదని అనంత్ తెలిపారు.
కేడర్‌కు రేడియో సంకేతం
జనవరి 1, 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి 11:15 గంటల మధ్య నాయకత్వాన్ని సంప్రదించడానికి రేడియో సెట్ ఫ్రీక్వెన్సీ-435.715ను ఉపయోగించాలని అనంత్ ఎంఎంసీ కేడర్‌కు సూచించారు. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ఫ్రీక్వెన్సీ ద్వారా సంప్రదించాలని కోరారు.
అలాగే, ఈ కీలక సమాచారం మావోయిస్టు కార్యకర్తలకు చేరేందుకు వీలుగా, జాతీయ వార్తా ప్రసారాలు వెలువడడానికి ముందు, రాబోయే రెండు రోజుల పాటు రేడియోలో ఈ ప్రకటనను ప్రసారం చేయాలని ఆయన మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మొత్తం ప్రక్రియ శాంతియుతంగా పూర్తయ్యేందుకు సహకరించాలని సోను దాదా, సతీష్ దాదాను అనంత్ కోరారు.







