పౌరసరఫరాల రికార్డు లకు మిల్లులోని ధాన్యం నిల్వలకు భారీ వ్యత్యాసం ..
Narsampet Aravinda Rice Mill Paddy Scam | నర్సంపేట పట్టణ శివారులోని అరవింద రైస్ మిల్లులో భారీ స్థాయిలో ధాన్యం నిల్వలు మాయమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రికార్డులకు, మిల్లులో ఉన్న వాస్తవ నిల్వలకు మధ్య పొంతన (Narsampet Paddy Stock Discrepancy) లేకపోవడంతో పెను దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ‘సర్కార్ లైవ్ (Sarkar Live)’ కథనం ప్రచురించడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో మరికొన్ని గంటల్లోనే పౌరసరఫరాల శాఖ అధికారులు ‘ఫిజికల్ వెరిఫికేషన్’ (Physical Verification) చేస్తారని ప్రచారం జరుగుతోంది.
Paddy Scam : అక్రమ విక్రయాల కలకలం.. తేడాలు ఎక్కడ?
నర్సంపేట లోని అరవింద రైస్ మిల్ కు ప్రభుత్వం మిల్లింగ్ కోసం కేటాయించిన వేల క్వింటాళ్ల ధాన్యం లెక్కల్లో భారీగా వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం. రికార్డుల ప్రకారం ఉండాల్సిన నిల్వల్లో సగానికి పైగా ధాన్యం మిల్లు ఆవరణలో కనిపించడం లేదని తెలుస్తోంది. మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని అధికారుల కళ్లుగప్పి, గుట్టుచప్పుడు కాకుండా బహిరంగ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నారనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీజ్ చేసేందుకు అధికారుల సన్నద్ధం!
అరవింద మిల్లు అక్రమాలపై ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లోనే ఉన్నత స్థాయి ప్రత్యేక బృందాలతో మిల్లులోని ప్రతి బస్తాను లెక్కించేలా (Physical Verification) కార్యాచరణ సిద్ధం చేసినట్లు సమాచారం.రికార్డులకు, నిల్వలకు మధ్య ఒక్క గింజ తేడా వచ్చినా సదరు మిల్లును వెంటనే సీజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.నిర్వాహకులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇతర మిల్లుల్లోనూ వణుకు!
నర్సంపేట ప్రాంతంలోని మరికొన్ని రైస్ మిల్లుల్లోనూ ఇలాంటి ‘గోల్‌మాల్’ అక్రమాలే జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, అరవింద మిల్లుపై జరిగే తనిఖీలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి? అధికారులు ఎవరిపై చర్యలు తీసుకుంటారు? అనేది ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








