Nizamabad : జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఇందల్వాయి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపీ గురువారం దారుణ హత్యకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు చివరకు రక్తపాతానికి దారితీయడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కారుతో గుద్ది.. కత్తితో పొడిచి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా (Nizamabad ) ఇందల్వాయి మండల కేంద్రంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఇమ్మడి గోపీపై ఆయనకు బంధువైన సతీశ్ పక్కా ప్లాన్‌తో దాడి చేశాడు. తొలుత గోపీని తన కారుతో బలంగా ఢీకొట్టి కింద పడేశాడు. ఆ వెంటనే తేరుకునే లోపే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన గోపీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హత్య చేసిన అనంతరం నిందితుడు సతీశ్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
హత్యకు దారితీసిన ‘సర్పంచ్’ ఎన్నికల పగ!
ఇమ్మడి గోపీ. నిందితుడు సతీశ్ వరుసకు మామ-మేనల్లుళ్లు. అయినప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ శత్రుత్వం నెలకొంది. ఈ గొడవలకు ప్రధాన కారణం గౌరవరం గ్రామ రాజకీయాలని తెలుస్తోంది. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గౌరవరం సర్పంచ్ పదవి కోసం గోపీ భార్య, సతీశ్ భార్య ఇద్దరూ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో గోపీ భార్య విజయం సాధించగా, సతీశ్ భార్య ఓటమి పాలయ్యారు.
అప్పటి నుంచి గ్రామంలో ఆధిపత్యం కోసం ఇరువర్గాల మధ్య గొడవలు ముదిరాయి. చిన్న విషయాల్లోనూ ఘర్షణలు జరుగుతూ ఉండటంతో సతీశ్ పాత కక్షలను మనసులో పెట్టుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం.
గౌరవరంలో ఉద్రిక్తత.. భారీగా పోలీసు బందోబస్తు
ముఖ్య నేత అయిన ఇమ్మడి గోపీ హత్య వార్త తెలియగానే గౌరవరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు.
నిందితుడు సతీశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇది ముందస్తు ప్రణాళికేనా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రాథమికంగా కుటుంబ, రాజకీయ విభేదాలే కారణమని భావిస్తున్నప్పటికీ, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








