PIL in SC to restrict scenes : మన దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అనేక మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా యువత ఈ యాక్సిడెంట్లకు ఎక్కువగా బలవుతున్నారు. నిత్యం జరిగే ప్రమాదాలను పరిశీలిస్తే.. రోడ్డుపై బైక్ రైసింగ్, స్టంట్స్ చేయడం, ట్రాఫిక్ రూల్స్ లెక్కచేయకుండా డ్రైవింగ్ చేయడం వంటి కరణాల వల్ల జరిగేవే ఎక్కువగా ఉంటున్నాయి.
సీన్లు చూసి.. స్టంట్లు చేసి..
దీనికి సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్, ఓటీటీ ( OTT) కంటెంట్, అడ్వర్టైజ్‌మెంట్స్‌లో చూపించే దృశ్యాలే కారణని అంటున్నారు సామాజిక వేత్తలు. ఈ సీన్లను చూసే యువత అలాంటి దుశ్చర్యలకు పాల్పడి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సునామీ ఆన్ రోడ్’ (Tsunami on Roads) అనే స్వచ్ఛంద సంస్థ (NGO) సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజనాల వాజ్యం (Public interest litigation (PIL) దాఖలు చేసింది. సినిమాలు, టీవీ కార్యక్రమాలు, వెబ్ సిరీస్‌లు, యాడ్స్‌లో ట్రాఫిక్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్న సన్నివేశాలను నియంత్రించాలని కోరింది.
30 ఏళ్లలోపు వయసున్న వారే ఎక్కువ
దేశంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను చూస్తే దిగ్భ్రాంతిని కలిగిస్తోందని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. రోజుకు సగటున 450 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సురక్షితమైన డ్రైవింగ్ పట్ల అవగాహన లోపం, యువత అధిక వేగంతో బైక్, కారు నడపడం,
సినిమాలు, వెబ్ సిరీస్‌ల ప్రభావంతో రోడ్డుపై స్టంట్స్ చేయడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సీటు బెల్ట్, హెల్మెట్ ఉపయోగించకపోవడం, సిగ్నల్స్ వద్ద ఆగకపోవడం లాంటి దుశ్చర్యలు ఈ యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయని ఆ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. అంతేకాదు.. ధ్వంసమైన రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది. భారతదేశంలో నిత్యం ప్రమాదాల్లో మరణించే వారిలో 40-50 శాతం మంది 16 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువతే ఉంటున్నారని తెలిపింది.
PIL in SC to restrict Scenes : మార్గదర్శకాలు రూపొందించాలి
సినిమాల్లో, టీవీ షోలలో ట్రాఫిక్ నిబంధనలను లెక్కచేయకుండా చూపించే దృశ్యాలను నియంత్రించాలని సునామీ ఆన్ రోడ్ సంస్థ సుప్రీం (Supreme court) ను కోరింది. అత్యవసరంగా అలాంటి సన్నివేశాలను చూపాల్సి వస్తే “దయచేసి వీటిని అనుసరించవద్దు” అని హెచ్చరికలు పెట్టాలని కోరింది. సిగరెట్, మద్యం ప్రకటనలను నిషేధించినట్లుగా, రోడ్డుపై ప్రమాదకరమైన డ్రైవింగ్, స్టంట్స్, రేసింగ్ వంటి దృశ్యాలను కూడా నియంత్రించాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (Ministry of Information & Broadcasting), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (Central Board of Film Certification (CBFC) సంయుక్తంగా మార్గదర్శకాలు రూపొందించాలని కోరింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







