PM Modi US visit : ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అమెరికాలో పర్యటిస్తున్నారు. నిన్న (బుధవారం) వాషింగ్టన్ డీసీ (Washington DC)కి చేరుకున్న ఆయన అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ (Tulsi Gabbard)తో భేటీ అయ్యారు. భారత్-అమెరికా మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఈ పర్యటనకు ముందు ఫ్రాన్స్‌లో రెండు రోజుల పర్యటనను ముగించారు. అక్కడి నుండి నేరుగా అమెరికాకు (PM Modi US visit) చేరుకున్నారు. వాషింగ్టన్ డీసీలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, ఇతర అధికారులు మోదీకి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.
కీలకాంశాలపై ఒప్పందాలు
డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ ఆ దేశంలో తొలిసారిగా పర్యటిస్తున్నారు. ఈ రోజు (గురువారం) సాయంత్రం ఆయన ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య పలు కీలక అంశాలపై ఒప్పందాలు జరగనున్నాయి. ముఖ్యంగా భారత్-అమెరికా రక్షణ సంబంధాల బలోపేతం, అక్రమ వలసలు, హెచ్1బీ వీసాలు, టారిఫ్‌లు తదితర విషయాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.
రక్షణ రంగంలో సహకారం
భారతదేశం -అమెరికా మధ్య రక్షణ రంగంలో సహకారం పెరుగుతోంది. అమెరికా (America) నుంచి స్ట్రైకర్ కాంబాట్ వాహనాలను భారతదేశం (India) కొనుగోలు చేయాలనుకుంటోంది. ఈ వాహనాలు భారత సైన్యానికి అధిక ఎత్తు ప్రాంతాల్లో ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీతో కలిసి జెట్ ఇంజిన్లను సంయుక్తంగా ఉత్పత్తి చేయడంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.
PM Modi US visit.. వాణిజ్య సంబంధాలు
భారతదేశం నుంచి మరిన్ని ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఉత్పత్తులపై భారత్ టారిఫ్‌లను 40-50 శాతం తగ్గించింది. అలాగే అమెరికా నుంచి మరింత చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. గత సంవత్సరం అమెరికా నుంచి సుమారు 65 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది.
ఇమ్మిగ్రేషన్, వీసా సమస్యలపై ..
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తిరిగి స్వదేశానికి పంపడంపై కూడా రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అమెరికా నుంచి 104 మందిని భారతదేశం తిరిగి స్వీకరించింది. ఈ చర్యలు ఇరు దేశాల మధ్య ఇమ్మిగ్రేషన్ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయని ట్రంప్, మోదీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..