ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ఆటో డ్రైవర్ల ప్రధాన బాధ్యత అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఆరైవ్ అలైవ్” (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా, నేడు కాజీపేట రైల్వే ఆడిటోరియంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు. డ్రైవర్లు అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వీడాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. మితిమీరిన ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని డ్రైవర్లతో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీలు సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్డి మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.








