సర్పంచ్ అభ్యర్థి (sarpanch contestant) అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లా రాయికోడ్ (Raikode) మండలంలో ఈ రోజు వెలుగు చూసింది. పిప్పాడపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా నామినేషన్ దాఖలు చేసిన వల్కి రాజు మృతదేహం కాంగ్రెస్ (Congress) మండల అధ్యక్షుడు బాలాజీ నరసింహులు ఫామ్‌హౌజ్ సమీపంలో లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఫామ్‌హౌజ్‌కు వెళ్లాక ఏం జరిగింది?
స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ కార్యకర్త వల్కి రాజు తన స్వగ్రామం పిప్పాడపల్లి (Pippadpally) పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ (nomination) దాఖలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలాజీ నరసింహులును కలవడానికి గ్రామ శివారులో ఉన్న ఆయన ఫామ్‌హౌజ్‌కు వెళ్లారు. ఎన్నికల ప్రచారం (election campaign), విజయం సాధించడానికి పాటించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇదే క్రమంలో సోమవారం ఉదయం గ్రామస్థులకు రాజు మృతదేహం నరసింహులు ఫౌమ్‌హౌజ్ సమీపంలోని చెట్టుకు వేలాడుతూ కనిపించింది. దీంతో షాక్ తిన్న గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు రాజు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాకే మృతికి కారణాలు వెల్లడవుతాయని తెలిపారు.
రాజకీయ సంబంధాలపై దర్యాప్తు
ఈ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నట్టు తెలిసింది. రాజు ఆత్మహత్య చేసుకున్నారా.. లేదా ఆయన్ను ఎవరైనా హత్య చేశారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా నామినేషన్ వేసిన రాజు ఇలా ప్రాణాలుల కోల్పోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రామస్థులు మాత్రం రాజుది ముమ్మాటికీ హత్యే అని, ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు ఆయన కాదని అంటున్నారు.
ఇద్దరూ మంత్రి అనుచరులే…
వల్కి రాజు , బాలాజీ నరసింహులు ఇద్దరూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Health Minister Damodara Rajanarasimha) అనుచరులని తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో రాజు మృతి తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఈ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలో రాజు గెలిచే అవకాశాలు మెండుగా ఉండగా ఈ ఘటన చోటుచేసుకుందని, ఇందులో రాజకీయ కోణం లేకపోలేదని అంటున్నారు. ఇది సాధారణ ఆత్మహత్య కాదని, పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నిజనిజాలు బయట పెట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







