SI Chandrashekhar Suicide Karimnagar | కరీంనగర్ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. తన భార్య మరణాన్ని తట్టుకోలేక ఒక ఎస్సై ప్రాణాలు తీసుకున్న ఘటన స్థానికులను కలచివేస్తోంది. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న దేశి చంద్రశేఖర్, శనివారం తన అత్తగారి ఇల్లు అయిన ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరి మృతి
ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య, మంగళవారం కరీంనగర్‌లోని తమ నివాసంలో గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె అంత్యక్రియలు పుట్టినిల్లు అయిన సీతంపేటలో నిర్వహించారు. శనివారం నాటికి దివ్య మరణించి ఐదు రోజులు కావడంతో, శాస్త్రబద్ధంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే “డ్రెస్ మార్చుకుని వస్తాను” అని చెప్పి చంద్రశేఖర్ గదిలోకి వెళ్లారు.
SI Suicide : తలుపులు బద్దలు కొట్టి చూడగా..
గదిలోకి వెళ్లిన చంద్రశేఖర్ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూడగా, ఆయన చున్నీతో ఉరికి వేలాడుతూ కనిపించారు. వెంటనే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా, ఆయన అప్పటికే ప్రాణాలు విడిచినట్లు గుర్తించారు. భార్య మరణంతో కలిగిన మనస్థాపమే ఈ దారుణ నిర్ణయానికి కారణమని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అనాథలైన చిన్నారులు
ఐదు రోజుల వ్యవధిలోనే అటు తల్లి, ఇటు తండ్రి ఇద్దరినీ కోల్పోవడంతో ఆ దంపతుల ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి పిల్లలను ప్రయోజకులను చేయాల్సిన తల్లిదండ్రులు ఇలా తనువు చాలించడం చూసి ఇరు కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు శోకసముద్రంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న ఇల్లందకుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తమ్ముడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన విధి నిర్వహణలో సమర్థుడిగా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.








