Strong earthquake In Delhi | దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ప్రజలు నిద్రలో ఉండగా 5:36 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.0గా దీని తీవ్రత నమోదైంది. జాతీయ భూకంపశాస్త్ర కేంద్రం (National Center for Seismology – NCS) ప్రకారం భూకంపం 28.59 ఉత్తర అక్షాంశం (latitude), 77.16 తూర్పు రేఖాంశం (longitude) వద్ద రికార్డయ్యింది. ఈ భూకంపం భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో ఉద్భవించింది.
Strong earthquake : పరుగులు తీసిన ప్రజలు
ఈ భూకంపం తీవ్రత ఢిల్లీ నగరంతోపాటు నోయిడా, ఇందిరాపురం, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘాజియాబాద్ తదితర ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో కనిపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటికి పరుగులు తీశారు. ఈ భూకంపం ఐదారు సెకన్ల పాటు మాత్రమే కొనసాగినప్పటికీ దాని తీవ్రత ప్రజలను ఉలికిపడేలా చేసింది. ముఖ్యంగా పాత బహుళ అంతస్తుల భవనాల్లో నివసించే వారు భయాందోళనకు గురయ్యారు. భయంతో బయటికి పరుగులు తీశారు. కొందరు తమ చిన్నపిల్లలను ఎత్తుకొని కుర్చీలు, మంచాల కింద దాక్కోవడానికి ప్రయత్నించారు.
Strong earthquake : ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూకంపాలు మామూలే..
భూకంప శాస్త్రపరంగా చూసినట్లయితే.. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం సెస్మిక్ జోన్ IV కింద వస్తుంది. అంటే.. ఇది మధ్యస్థ నుంచి బలమైన భూకంపాలకు ఎక్కువ ప్రమాద పరిధిలో ఉంటుందన్నమాట. భూగర్భ ప్లేట్ల కదలికలు (tectonic movements) వల్ల ఉత్తర భారతదేశంలోని హిమాలయ ప్రాంతం తరచుగా భూకంపాలకు గురవుతూ ఉంటుంది. సాధారణంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో చిన్న స్థాయి భూకంపాలు మామూలే. ఈ రోజు ఉదయం 4.0 తీవ్రతతో సంభవించడం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి అధికారిక నివేదికలు రాలేదు.
సోషల్ మీడియా ద్వారా నేతల స్పందన
భూకంపం వార్త బయటకు వచ్చిన వెంటనే ఢిల్లీ రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి ఢిల్లీలో బలమైన భూకంపం సంభవించిందని, అందరూ సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తన ట్విట్టర్ ( X) ఖాతాలో పేర్కొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







