Tamil Nadu Bus Accident | శివగంగ (తమిళనాడు) : తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహా 11 మంది మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. అనేక మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
హుటాహుటిన స్పందించిన స్థానికులు
తిరుప్పూర్ నుంచి కరైకుడికి ఒక బస్సు, కరైకుడి నుంచి దిండిగల్కు మరొక బస్సు ప్రయాణిస్తుండగా, తిరుపత్తూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులకు అవసరమైన సాయం అందించారు. గాయపడిన వారిని హుటాహుటిన శివగంగైలోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఆ తర్వాత స్థానిక యంత్రాంగం, పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాయి. కొంతమంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నందున, మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
వారం వ్యవధిలో ఇది రెండో ప్రమాదం
దక్షిణాది రాష్ట్రంలో ఒక వారం వ్యవధిలో ఇది రెండో అతిపెద్ద ప్రమాదం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గతంలో నవంబర్ 24న తెన్కాసి జిల్లాలోని ఇడైకల్ సమీపంలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మరణించగా, 56 మంది గాయపడ్డారు. బస్సు డ్రైవర్లలో ఒకరి మితిమీరిన వేగం కారణంగానే ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
నవంబర్ 24న జరిగిన తెన్కాసి ప్రమాదానికి సంబంధించి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు సీఎం సహాయ నిధి నుంచి అందించాలని ఆదేశించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







