మంత్రి పొన్నం ప్రభాకర్‌పైనే భారం!
Telangana Agitators Welfare : స్వరాష్ట్ర కల సాకారమై దశాబ్దం దాటినా, ఆ కల కోసం లాఠీ దెబ్బలు తిని, జైలు గోడల మధ్య నలిగిపోయిన సామాన్య ఉద్యమకారుల బతుకులు నేటికీ ‘గోస’ పడుతూనే ఉన్నాయి. పదవుల పంపకాలు పూర్తి కావడంతో పాలన గాడిలో పడింది కానీ, క్షేత్రస్థాయిలో పోరాడిన యోధుల సంక్షేమం మాత్రం ఇంకా హామీలకే పరిమితమైంది. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో మొండిచేయి ఎదురవ్వగా, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ఉద్యమకారులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
బిఆర్ఎస్ హయాంలో అన్యాయం.. ఆవేదనలో ఉద్యమకారులు
తెలంగాణ ఉద్యమమే పునాదిగా అధికారంలోకి వచ్చిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ఉద్యమకారులను విస్మరించిందనే విమర్శలు బలంగా ఉన్నాయి. జైలుకు వెళ్లిన వారికి, అక్రమ కేసులు ఎదుర్కొన్న సామాన్యులకు తగిన గుర్తింపు లభించలేదు. కొద్దిమందికే పదవులు దక్కాయని, మెజారిటీ పోరాట యోధులు నేటికీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఉద్యమ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
కాంగ్రెస్ హామీలు: ఆశల పల్లకి
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఉద్యమకారుల్లో కొత్త ఆశలు చిగురింపజేశాయి. ప్రధానంగా
అర్హులైన ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం,గౌరవప్రదమైన నెలవారీ పెన్షన్,అధికారిక గుర్తింపు కార్డులు మరియు సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యతలాంటి హామీల అమలు కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రులు ప్రకటించడం సానుకూల పరిణామంగా కనిపిస్తోందిని ఉద్యమకారులు అంటున్నారు
Telangana Agitators Welfare : మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పెరిగిన బాధ్యత!
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీగా ఉండి పార్లమెంట్లో గళం వినిపించడమే కాకుండా, ‘పెప్పర్ స్ప్రే’ వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పైనే ఉద్యమకారులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
“ఉద్యమ కష్టనష్టాలు తెలిసిన వ్యక్తిగా పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకోవాలని క్యాబినెట్లో ఒత్తిడి తెచ్చి, ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూడాలి” అని ఉద్యమకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తమ త్యాగాల పునాదుల మీద వెలసిన ప్రభుత్వం, తమను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా ఆత్మగౌరవాన్ని, ఆర్థిక భరోసాను కల్పించాలని వారు కోరుతున్నారు. కమిటీల ప్రకటనలు కాగితాలకే పరిమితం కాకుండా, ఆచరణలో అడుగులు పడాలని తెలంగాణ ఉద్యమకారులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








