Sponge Parks in Warangal : తరచూ భారీ వర్షాలతో మునిగిపోతున్న వరంగల్, హన్మకొండ నగరాలు ఇకపై పచ్చని రక్షణ కవచాన్ని పొందబోతున్నాయి. భూగర్భ జలాలను నిల్వ చేస్తూ, వరదలను అడ్డుకునే ‘స్పాంజ్ పార్క్’లు నగరపు భవిష్యత్తు పర్యావరణ సమతుల్యతను సాధించనున్నాయి.
హన్మకొండ, వరంగల్ నగరాల్లో ఇటీవల మోంథా తుఫాను కారణంగా 120 కంటే ఎక్కువ కాలనీలు మునిగిపోయిన నేపథ్యంలో , గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కీలక నిర్ణయం తీసుకుంది. ఒక సుస్థిర పట్టణ పరిష్కారాన్ని అమలులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. నగరంలోని వరద ముప్పును తగ్గించి, భూగర్భ జలాల స్థాయిని పెంచడానికి “స్పాంజ్ పార్క్‌లు” అనే వినూత్న ప్రాజెక్ట్ ను మొదలుపెడుతోంది.
స్పాంజ్ పార్క్‌లు వర్షపు నీటిని సహజంగా పీల్చుకుని భూమిలోకి మళ్లించే ప్రదేశాలు. ఇవి నగరంలోని తక్కువ భూమి ఉన్న ప్రాంతాల్లో వరదలను తగ్గించడమే కాకుండా, నీటి నిల్వకు కూడా తోడ్పడతాయి.
చెన్నైలో విజయవంతమైన నమూనా ఆధారంగా వరంగల్‌లోనూ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఖాళీగా ఉన్న ప్రదేశాలు, లోతట్టు ప్రాంతాలను వర్షపు నీటిని పీల్చుకునే పర్యావరణహితమైన పార్కులుగా మార్చిన చెన్నై అనుభవం.. ఇక్కడ కూడా పునరావృతం కానుంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట వంటి నగరాల్లో విస్తృతమైన కాంక్రీటీకరణ కారణంగా వరద ముప్పు ఏటేటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది.
GWMC ఇప్పటికే కాలువల విస్తరణ, రిటైనింగ్ వాల్‌లు నిర్మాణం, స్పాంజ్ పార్క్‌లను పట్టణ స్థిరత్వ ప్రణాళికలో భాగం చేసింది. ప్రస్తుతం 135 లోతట్టు ప్రాంతాలను సర్వే చేస్తూ మొదటి దశకు అనువైన ప్రదేశాలను గుర్తిస్తోంది. కాగా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ, “మేము ఒకటి లేదా రెండు పైలట్ స్పాంజ్ పార్క్‌లతో ప్రారంభించి నగరవ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికలో ఉన్నామని తెలిపారు. ఈ ప్రతిపాదన త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
స్పాంజ్ పార్క్‌లు కేవలం వరద నియంత్రణకే కాకుండా నగరం అందాన్ని రెట్టింపు చేస్తాయి. మురుగునీటిని పునర్వినియోగం చేస్తూ ఈ పార్కుల చెరువులను నింపి, సంవత్సరం పొడవునా పచ్చదనాన్ని నిలుపుతాయి. 2015లో వరదలతో తీవ్రంగా నష్టపోయిన చెన్నైలో ₹7.67 కోట్లతో 57 స్పాంజ్ పార్కులు అభివృద్ధి చేశారు. అయితే ఈ నమూనా ఇప్పుడు వరంగల్‌లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







