Sarkar Live

సీతక్కపై విమర్శలు చేస్తే సహించేది లేదు: మాజీ రెడ్కో చైర్మన్‌పై రేగ కళ్యాణి నిప్పులు

ములుగు: తెలంగాణ రాష్ట్ర మాజీ రెడ్కో చైర్మన్ ఏరువా అలియాస్ గుంటూరు సతీష్ రెడ్డి తీరుపై ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సతీష్ రెడ్డికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. శనివారం

ములుగు: తెలంగాణ రాష్ట్ర మాజీ రెడ్కో చైర్మన్ ఏరువా అలియాస్ గుంటూరు సతీష్ రెడ్డి తీరుపై ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సతీష్ రెడ్డికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసం మంత్రి సీతక్కపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

100 కోట్ల ఖర్చుకు 200 కోట్ల స్కాం ఎలా సాధ్యం?

మేడారం ఆలయ ప్రాంగణ నిర్మాణానికి సంబంధించి సతీష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను రేగ కళ్యాణి తిప్పికొట్టారు. “మేడారం గుడి ప్రాంగణ నిర్మాణానికే వంద కోట్లు ఖర్చు అయితే.. అందులో 200 కోట్ల స్కాం జరిగిందని చెప్పడం నీ అవివేకానికి నిదర్శనం. అద్దాల మేడల్లో ఉంటూ ప్రకటనలు ఇచ్చే నీకు క్షేత్రస్థాయి పరిస్థితులు ఏం తెలుసు?” అని ప్రశ్నించారు. మేడారం జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఘనత సీతక్కకే దక్కుతుందని ఆమె స్పష్టం చేశారు.

ములుగుకు నువ్వు చేసిన మేలు ఏంటి?

సతీష్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ.. “నువ్వు దేవగిరిపట్నం వాసివి అని చెప్పుకుంటావు కానీ, ఈ ప్రాంత అభివృద్ధికి తట్టెడు మట్టి కూడా పోయించిన దాఖలాలు లేవు. ములుగు జిల్లా కోసం పోరాటం చేసిన చరిత్ర నీకు లేదు. ఉద్యమ సమయంలో కేసీఆర్ దగ్గర ఊడిగం చేసి పదవులు తెచ్చుకున్నావు తప్ప, ములుగు ప్రజల కష్టాలను ఎన్నడూ పట్టించుకోలేదు. కేవలం ఎన్నికలకో, పర్యటనలకో వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడి ప్రజలు నమ్మరు” అని మండిపడ్డారు.

బాలుడి ప్రమాదంపై రాజకీయాలా?

మేడారంలో పనులు జరుగుతున్న సమయంలో స్థానిక పూజారి సిద్ధబోయిన రమేష్ కుమారుడికి జరిగిన ప్రమాదం దురదృష్టకరమని కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాలుడికి మెరుగైన శస్త్రచికిత్స అందించే బాధ్యతను మంత్రి సీతక్క స్వయంగా తీసుకున్నారని వెల్లడించారు. “ఒక బాలుడు దెబ్బ తగిలి బాధలో ఉంటే, ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి.. ఆ బాధను కూడా రాజకీయం చేయడం నీ నీచ మనస్తత్వానికి నిదర్శనం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివాసి బిడ్డ జోలికి వస్తే ఖబర్దార్!

కమిషన్ల కోసం కక్కుర్తి పడే అలవాటు బీఆర్ఎస్ నాయకులదేనని, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతే దానికి సాక్ష్యమని ఆమె ఆరోపించారు. సీతక్కకు సమ్మక్క-సారలమ్మ దేవతలే ప్రాణమని, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఆమె కృషి చేస్తున్నారని కొనియాడారు.

“దొరల కాళ్ల దగ్గర బానిసత్వం చేసి పదవులు పొందిన నువ్వు.. నిరంతరం ప్రజా సేవలో ఉండే సీతక్కను విమర్శించడం హాస్యాస్పదం. ఇకనైనా నీ వైఖరి మార్చుకోకపోతే ములుగు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. ఆదివాసి బిడ్డ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు.. ఖబర్దార్ సతీష్ రెడ్డి!” అంటూ రేగ కళ్యాణి హెచ్చరించారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?