Post-metric Scholarships : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్స్ (Post-metric Scholarships) కోసం ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం దీన్ని అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ (SC) విద్యార్థులకు ఇది వర్తించనుంది. దరఖాస్తు సమయంలో ఆన్‌లైన్‌లో వివరాలు సరిగా నమోదు కాకపోవడంతో అనేక మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌ను కోల్పోవాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం (Telangana government) కీలక నిర్ణయం తీసుకుంది.
రెండు దఫాలుగా అథెంటికేషన్
తెలంగాణ ప్రభుత్వం ఈ స్కాలర్‌షిప్ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి కొత్త దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియలో ప్రధానంగా రెండు ముఖ్యమైన దశలు ఉంటాయి. మొదట విద్యార్థులు ePass వెబ్‌సైట్‌లో తమ ఆధార్‌కార్డు, SSC సర్టిఫికేట్‌లోని పేర్లను సరిపోల్చి చూసుకొని ఒక నిర్దిష్ట అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది విద్యార్థుల గుర్తింపును నిర్ధారించడంలో సహాయపడుతుంది. తద్వారా పొరపాట్లు లేకుండా కచ్చితమైన సమాచారంతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆథెంటికేషన్ ప్రక్రియను పూర్తయ్యాక విద్యార్థులు MeeSeva కేంద్రంలో బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయాలి. దీన్ని పూర్తి చేసిన తర్వాత ePass వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం స్కాలర్‌షిప్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది.
బ్యాంకు అకౌంట్‌తో ఆధార్ లింక్
విద్యార్థులు తమ ఆధార్ నంబర్‌ను బ్యాంకు ఖాతాతో కచ్చితంగా లింక్ చేసి ఉండాలి. ఇది విద్యార్థులకు స్కాలర్‌షిప్ మొత్తాన్ని సులభంగా అందజేయడానికి దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఆధార్, బ్యాంకు అకౌంట్ ఖాతా లింకింగ్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. దీని ద్వారా విద్యార్థుల ఖాతాకు నేరుగా స్కాలర్‌షిప్ మొత్తాన్ని జమ చేయడం కూడా సులభమవుతుంది.
Post-metric Scholarships లో కళాశాలల పాత్ర
స్కాలర్‌షిప్‌ల పథకంలో కళాశాలలకు కూడా ప్రభుత్వం కొన్ని బాధ్యతలు అప్పగించింది. కళాశాలలు ePass వెబ్‌సైట్‌లో డిజిటల్ కీస్ పొంది, వాటిని రిజిస్టర్ చేయాలని ఆదేశించింది. ఈ డిజిటల్ కీస్ ద్వారా కళాశాలలు విద్యార్థుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ధృవీకరించి, వాటిని జిల్లా కార్యాలయాలకు పంపించాలి. అక్కడ పరిశీలన తర్వాత అన్ని రకాల అర్హతలు ఉంటే స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆమోదం లభిస్తుంది.
విద్యార్థులు మార్గదర్శకాలు చదవాలి
ఈ కొత్త విధానం మార్గదర్శకాలను ePass వెబ్‌సైట్‌లోని హోమ్ పేజీలో కూడా ఉంచామని ఎస్సీ కార్పొరేషన్ తెలిపింది. విద్యార్థులు తమ స్కాలర్‌షిప్ దరఖాస్తులను ePass వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసే ముందు వాటిని పూర్తిగా చదవాలని సూచించింది.
Scholarships సమర్థంగా అమలు చేయడానికే..
స్కాలర్‌షిప్ పథకాన్ని మరింత పారదర్శకంగా, సమర్థంగా మార్చడానికే ఈ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టామని ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థుల దరఖాస్తులు తిరస్కరణకు గురికాకుండా ఇదెంతో దోహదపడుతుందని తెలిపింది. తద్వారా స్కాలర్‌షిప్‌లను త్వరితగతిన జారీ చేయడానికి వీలు కలుగుతుందని అంటోంది. గతంలో ఉత్పన్నమైన సమస్యలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..