Telangana | వాణిజ్య వ్యాపారాలు విస్తరించేందుకు మంథని మంచిర్యాల పట్టణాలను కలుపుతూ గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.120 కోట్లు మంజూరు చేశామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) వెల్లడించారు. బ్రిడ్జి నిర్మాణ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. మంథని పట్టణంలో యువకులకు ఉపాధి కల్పించేందుకు చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు తీసుకువస్తామని తెలిపారు.
అలాగే మంథని సమీపంలోని రామగిరి క్షేత్రాన్ని రూ.5 కోట్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. మంథని సమీపంలో గోదావరి నది పుష్కరాలు నిర్వహణకు రూ. 2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మంథని పట్టణ సమీపంలో 150 మంది మహిళ సంఘాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ చిన్న ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. బడా కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు మన యువతకు అందించే దిశగా స్కిల్‌సెంటర్ ను త్వరలోనే ఇక్కడ ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా యువకులకు శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పారు. నీడ లేని నిరుపేదలకు ఇళ్ల అందించే ఇందిరమ్మ పథకం ప్రారంభిస్తున్నామని, తొలి విడతలో భూమి ఉండి, ఇళ్లు లేని వారిని ఎంపిక చేసి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. భవిష్యత్తులో అనువైన భూమిని ఎంపిక చేసి పేదలకు ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. మంథని పట్టణంలో అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మిస్తామని తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో బోనస్ కింద ఇప్పటి వరకు 20 కోట్ల పైగా నిధులు రైతుల ఖాతాలలో జమ చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 17,000 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రూ.236 కోట్ల నిధులను వారి బ్యాంకు ఖాతాలలో జమ చేశామని తెలిపారు .రైతులకు, కౌలు రైతులకు లబ్ధి చేకూర్చేలా త్వరలో రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.