Trains Stopped : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్స్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యతో పలు ట్రైన్స్ రాకపోకలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ నుంచి నాగ్‌పుర్ వెళ్లే వందే భారత్, దిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు అరగంట పాటు నిలిచిపోవాల్సి వచ్చింది .సిర్పూర్ కాగజ్‌నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు గంటన్నర పాటు నిలిచిపోయాయి.
దీంతో పలు రైళ్లలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక సింగరేణి ప్యాసింజర్ ఉప్పల్ స్టేషన్‌లో 20 నిమిషాలు నిలిచిపోయింది.మెయిన్‌లైన్‌లో ఒక గూడ్స్ రైలు ఆగింది. మరోవైపు సిగ్నల్ సమస్య కారణంగా ఉప్పల్ ఆర్వోబీ సమీపంలో రైల్వే గేటు తెరుచుకోలేదు. ఫలితంగా ఇరువైపులా రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రెండు వైపులా గేట్లు తెరుచుకోకపోవడంతో హుజూరాబాద్ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు సైతం స్తంభించిపోయాయి.