- తరుగు పేరుతో రైతుల ధాన్యాన్ని దోచుకుంటున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు
- బస్తాకు 2 నుంచి 5 కిలోల వరకు కోతపెడుతున్నట్లు సమాచారం
- మామూళ్ల అలవాటు పడి చూసిచూడనట్లగా కొందరు అధికారులు!
- తరుగు పేరుతో తీసిన ధాన్యం ఎవరి ఖాతాలోకి వెళుతోంది?
- ఆ డబ్బులు ఎవరు మింగుతున్నారు?
Paddy Procurement | రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని తరుగు పేరుతో బస్తాకు 2 నుంచి 5 కిలోల వరకు కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మక్కై దోచుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అధికారులే మిల్లర్లు ఇచ్చే మామూళ్లకు (మేతకు) అలవాటు పడి చూసీచూడనట్ల వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొంతమంది పౌరసరఫరాల శాఖ అధికారుల మూలంగా మసకబారే ప్రమాదం ఉందని రైతు సంఘాల నేతలు బహిరంగంగానే
అధికారుల తీరు పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు సన్నాలకు రూ.500 బోనస్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ కొనుగోళ్ల ప్రక్రియ రైతులకు మేలు చేయడం అటుంచితే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, మిల్లర్లకు, పౌరసరఫరాల శాఖ అధికారులు కాసుల వర్షం కురిపిస్తోందని ప్రచారం లేకపోలేదు.
బస్తాకు 2 నుండి 5 కిలోల కోత..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొనుగోలు సెంటర్ లకు రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని తరుగు పేరుతో దోచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్తాకు 600 గ్రాములు మాత్రమే తరుగు తీయాలని ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా కొనుగోలు కేంద్రాలతోపాటు మిల్లులో బస్తాకు 2 నుంచి 5 కిలోల వరకు తరుగు పేరుతో కోత విధించడం మాములేనని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ధాన్యంలో కోత పెడుతుంటే అడ్డుకోవాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు వారికే వంత పాడుతున్సనారనే ప్రచారం సాగుతోంది.
ఆ ధాన్యం డబ్బులు ఎవరి ఖాతాలోకి…
రైతులు ధాన్యం కొనుగోలు (Paddy Procurement) కేంద్రాలకు వడ్లను తీసుకువచ్చేటప్పుడు వారివెంట పట్టా పాసు బుక్ తో పాటు బ్యాంకు ఖాతా తీసుకువచ్చి కొనుగోలు కేంద్రంలో ఇస్తే వారి డేటా ఎంట్రీ చేసి వారం రోజుల్లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తారు. అంతా బాగానే ఉన్నప్పటికీ
రైతులు (Farmers) తీసుకువచ్చిన ధాన్యంలో తరుగుపేరుతో తీసిన ధాన్యం ఏమవుతుంది ఆ ధాన్యం డబ్బులు ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయనేది అనేది అంతుచిక్కని ప్రశ్న మిగులుతోంది. ఉదాహరణకు ఓ రైతు 40 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే తరుగుపేరుతో 5 క్వింటాళ్ల ధాన్యం కోత పెడితే మరి 5 క్వింటాళ్ల ధాన్యం ఎవరి ఖాతాలో జమచేస్తున్నట్లు? అదే రైతుకు 35 క్వింటాళ్లు తెచ్చినట్లు రశీదు ఇస్తున్నారే తప్ప అదే రశీదులో 40 క్వింటాళ్లు తీసుకువచ్చారు అందులో 5 క్వింటాళ్లు తరుగు అని ఎందుకు రాయడంలేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, మిల్లుల్లో తరుగు పేరుతో కొన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం తరుగు పేరుతో మాయమవుతోంది మరి ఆ ధాన్యం ఎటుపోతోంది, ఎవరి ఖాతాలో ఆ ధాన్యం డబ్బులు పడుతున్నాయి అనే విషయం అటు వ్యవసాయ శాఖ అధికారులకు, ఇటు పౌరసరఫరాల శాఖ అధికారులకు స్పష్టంగా తెలిసినప్పటికీ వారిచ్చే మామూళ్ల మేతకు అలవాటు పడిన కొంతమంది అధికారులు గమ్మునుంటున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, ఎక్స్(ట్విట్టర్) లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..