Ramgopal varma : ఎప్పుడూ ఏదో ఒక సందర్భంగా ఎవరో ఒకరి మీద నోరు పారేసుకోవడం సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ నైజం. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, పోస్టులతో ఆయన ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై కూడా అనుచిత పోస్టులు పెట్టిన రాంగోపాల్ వర్మ ఇరుకాటంలో పడ్డారు. దీనిపై కేసును ఎదుర్కొని అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయనకు ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తూ దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు కచ్చితంగా హాజరు కావాలని కండీషన్ పెట్టింది.
రాంగోపాల్ వర్మ ఏం చేశారంటే…
రాంగోపాల్ వర్మ సారథ్యంలో రూపొందించిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, నారా లోకేశ్, బ్రాహ్మణి, పవన్ కల్యాణ్ ఫొటోలను మార్ఫింగ్ చేశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో వర్మపై ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫొటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈనెల 10న ఏడు సెక్షన్లతో రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదైంది. అయితే.. దీన్ని కొట్టేయాలని ఏపీ హైకోర్టును రాంగోపాల్ వర్మ ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మను విచారించేందుకు పోలీసులు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాట్లు చేశారు.
పోలీసులకు చుక్కలు చూపించిన ఆర్జీవీ
కేసు విచారణకు రావాలని పోలీసులు రాంగోపాల్ వర్మ రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. అయినా ఆయన విచారణకు రాలేదు. తాను బిజీగా ఉన్నానని విచారణకు రాలేనని తెగించి చెప్పారు. తనకు వారం రోజుల సమయం ఇవ్వాలని కోరారు. అందుకు పోలీసులు ఓకే అన్నారు. విచారణకు హాజరుకాకపోవడంతో మళ్లీ వారం తర్వాత మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ ఆయన ససేమిరా అన్నారు. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేశారు. వర్మ ఉంటున్న ఇంటికి వెళ్లగా ఆయన అక్కడ లేకపోవడంతో వెనుతిరిగారు. దీంతో పోలీసులు మరింత యాక్టివ్ అయ్యారు. పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న ఆర్జీవీ సోషల్ మీడియాలో మాత్రం హల్‌చల్ చేస్తూ వస్తున్నారు. పలు మీడియా చానెల్స్‌కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నారు. పనిలోపని పోలీసులపై ఒక ఆరోపణ కూడా చేశారు. తాను పరారీలో ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని, తానెక్కడికీ పోలేదని అన్నారు. పోలీసులు తన ఆఫీసుకే రాలేదని చెప్పారు.
విజ్ఞప్తిని ఆలకించిన హైకోర్టు
ఈ క్రమంలోనే ఈ కేసు హైకోర్టుకు వచ్చింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వర్మ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం ఆలకించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ పోలీసు విచారణ మాత్రం హాజరు కావాలని కండీషన్ పెట్టింది.