- డబ్బులు ఇచ్చినవారికే ప్రాధాన్యమా..?మెరిట్ లిస్ట్ ప్రకారం కేటాయిస్తారా..?
- నర్సంపేట మెడికల్ కళాశాల లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు భారీగా అప్లై చేసుకున్న నిరుద్యోగులు
- ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పై దరఖాస్తు దారుల్లో అనేక అనుమానాలు
- ఇప్పటికే ఆ ఏజెన్సీ కొంత మంది నుండి డబ్బులు వసూళ్లు చేసినట్లు ప్రచారం..?
Outsoursing jobs | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటైన 8 మెడికల్ కళాశాలల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగాలను రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీలకు అప్పజెప్పింది. ప్రభుత్వ నిర్ణయం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు కనిపిస్తున్నప్పటికి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు మాత్రం కాసుల వర్షం కురుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 8 మెడికల్ కాలేజీల్లో ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని నర్సంపేట మెడికల్ కళాశాలలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు దక్కించుకున్న ఏజెన్సీ ఏ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తుందో తెలియక నిరుద్యోగులు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. ఈ కళాశాలలో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు జిల్లా నలుమూలల ఉన్న నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు.
65 పోస్టులు… 4200 అప్లికేషన్లు..
వరంగల్ జిల్లా నర్సంపేట మెడికల్ కళాశాల లో ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన 65 పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించనున్నట్లు తెలిసింది. 65 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను “గణేష్ మ్యాన్ పవర్” అనే ఏజెన్సీ కి అప్పగించినట్లు సమాచారం. ఉద్యోగాలను దక్కించుకున్న సదరు ఏజెన్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సైతం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ మెడికల్ కళాశాలలో ఉన్న 65 పోస్టులకు గాను ఎవరూ ఊహించని రీతిలో 4200 మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు.ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఏజెన్సీ కే అప్పజెప్పినట్లు సదరు ఏజెన్సీ లిస్ట్ తయారు చేసే పనిలో ఉందని ఆయన అన్నారు
ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై అనుమానాలు..?
నర్సంపేట మెడికల్ కళాశాలలో 65 పోస్టులు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారని సమాచారం అందుకున్న నిరుద్యోగులు ఉద్యోగాల కోసం 4200 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగుల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పై అనేక రకాల అనుమానాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. మెరిట్ లిస్ట్ ప్రకారమే ఎంపిక చేస్తారా? లేదంటే పైరవీలు నడుస్తాయా..? ఏజెన్సీ నిర్వాహకులను మచ్చిక చేసుకున్న వారికే అవకాశాలు దక్కుతాయా?అనే ప్రశ్నలు దరఖాస్తు దారులను కలవరపెడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.కాగా ఇప్పటికే సదరు ఏజెన్సీ నిర్వాహకులకు కొంతమంది ఉద్యోగాల కోసం లకారాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగడం కొసమెరుపు.ఆ 65 పోస్టులు నిబంధనల ప్రకారం మెరిట్ ఉన్నవారికే కేటాయిస్తారా?లేదంటే లకారాలు ముట్టజెప్పిన వారికి కేటాయిస్తారా?అనేది మరో మూడు ,లేదా నాలుగు రోజుల్లో తేలిపోనుంది.నర్సంపేట మెడికల్ కాలేజీలోని ఉద్యోగాలు భర్తీ చేసినాక 4200 మంది దరఖాస్తు దారుల సర్టిఫికేట్ లు మీడియా ముందు బహిర్గతం చేస్తే సదరు ఏజెన్సీ గుట్టు రట్టయ్యే అవకాశం ఉంటుందని నిరుద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా ఎక్స్(ట్విట్టర్) లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
2 Comments
Warangal hanamkonda still narsampet medical College s perform to poor no job
[…] రీజియన్ లో మెడికల్ ఆఫీసర్ గా(Medical Officer) ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న […]