2025 Delhi polls : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండబోతోందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ఇతర రాజకీయ పక్షాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఈ రెండు పార్టీల అధినాయకత్వాలు చేసే ప్రకటన ఎలా ఉండబోతుందోననే ఆసక్తి సర్వత్రా వ్యక్తమైంది. అయితే.. దీనిపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. రెండు పార్టీల పొత్తు విషయంలో ఊహాగానాలకు తెరపడింది.
ఎక్స్‌వేదికగా కేజ్రీవాల్ ప్రకటన
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) ఈ ఊహాగానాలకు తెరదింపారు. రెండు పార్టీల మధ్య అలయెన్స్ ఉండబోతుందనే అంశంపై స్పష్టమైన ప్రకటన చేశారు. “ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మేం ఒంటరిగానే పోటీ చేస్తాం. ఏ పార్టీతోనూ మాకు పొత్తు ఉండదు” అని తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. తమ స్వబలంతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు విషయంపై వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది.
సయోధ్య కుదరకనే ఈ నిర్ణయమా?
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ (AAP) మధ్య పొత్తు ఉంటుందనే విషయంలో చాలా రోజులుగా ఊహాగానాలు వస్తున్నప్పటికీ డిసెంబరు 10న వచ్చిన వార్తలు మరింత బలపడ్డాయి. ఆప్‌తో పొత్తు పెట్టుకొనేందుకు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఆసక్తిని కనబరుస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు శరత్ పవార్‌ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇది మరింత చర్చనీయాంశమైంది. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండబోతుందనడానికి ఇదే సంకేతమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే క్రమంలో ఊహించని విధంగా కేజ్రీవాల్ ప్రకటన వెలువడింది. అయితే.. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ మధ్య పొత్తు విషయంలో చర్చ జరిగి ఉంటుందని, పోటీ చేసే అసెంబ్లీ స్థానాల కేటాయింపుల్లో రెండు పార్టీ మధ్య సయోధ్య కుదరలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కోరినన్ని స్థానాలు కేటాయించడం ఇష్టం లేకనే ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకడుగు వేసిందని తెలుస్తోంది.
2025 Delhi polls పై ఇదే చివరి ప్రకటన!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ- కాంగ్రెస్ కూటమి (INDIA)పై గతంలోనూ కేజ్రీవాల్ ప్రకటన చేశారు. రెండు పార్టీల మధ్య పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. అయినప్పటికీ అలయెన్స్‌పై ఇటీవల మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా కేజ్రీవాల్ చేసిన ప్రకటనతో వీటికి తెరపడింది. కేజ్రీవాల్ చేసిన ఈ ప్రకటన ఇదే చివరిదని, దీనిపై మరోసారి ఆయన మాట్లాడే అవకాశమే లేదని తెలుస్తోంది.
రాఘవ చద్దా ధీమా
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చద్దా మాట్లాడుతూ కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందనే వార్తలు నిరాధారమని కొట్టిపారేసారు. కాంగ్రెస్‌తో అలయెన్స్ విషయంపై ఆ పార్టీతో ఎలాంటి చర్చనే లేదని అన్నారు. “మేం ఒంటరిగానే పోటీ చేస్తాం.. విజయం సాధించి తీరుతాం”
అని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ నాలుగోసారి అధికారంలోకి రాబోతుందన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “2025 Delhi polls | ఆప్-కాంగ్రెస్ కూటమిపై ఊహాగానాలకు తెర… పొత్తుపై కేజ్రీవాల్”