SUICIDE IN GURUKULA SCHOOL వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్ధులు వరుసగా మృత్యువాత పడుతుంటే.. మరోవైపు మరికొందరు విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతుండడం కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు గురుకులాల్లో వివిధ కారణాలతో 48 మంది విద్యార్థులు మృతి చెందారు. తాజాగా వనపర్తి జిల్లా మదనాపురం ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల (SOCIAL WALFAR SCHOOL) లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడో తరగతి విద్యార్థి పట్టపగలే.. వసతి గృహంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్మకు పాల్పడడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై స్థానకులు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు – సత్యమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. కూలి పనులు చేసుకుని శ్రీనివాసులు దంపతులు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివిస్తున్నారు. జోవనోపాధి కోసం తల్లిదండ్రులు హైదరాబాద్‌కి వచ్చి కొంతకాలంగా అక్కడే ఉంటున్నారు. వీరి రెండో కొడుకు ప్రవీణ్ (13) గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.. ఈ క్రమంలో ప్రవీణ్ పాఠశాలలో మంగళవారం సాయంత్రం కబడ్డీ ఆడుతుండగా గాయాలయ్యాయి. గాయాలైన ప్రవీణ్‌కు గురుకులంలో ఉండే హెల్త్ టేకర్ టాబ్లెట్లు అందించి, ప్రథమ చికిత్స అందించినట్లు సమాచారం.
Also Read : బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా : KTR
బాలుడు గాయపడిన విషయాన్ని టీచర్ ఫోన్‌లో ప్రవీణ్ తల్లిదండ్రులకు తెలిపినట్లు పేర్కొన్నాడు. ఆ మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం టిఫిన్ చేసిన తర్వాత విద్యార్ధులు ప్రార్థనకు వెళ్లారు. ఆ సమయంలో తనకు తలనొప్పి వస్తోందని టీచర్‌కు చెబితే.. టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకొమని ప్రవీణ్‌ను హాస్టల్ కు పంపించారు. అయితే వసతి గృహానికి వచ్చిన ప్రవీణ్.. అక్కడి ఫ్యాన్‌కు దుప్పటితో ఉరివేసుకొని ప్రాణాలు విడిచాడు. అప్పటికే ప్రవీణ్ తండ్రి హాస్పిటల్ కు తీసుకెళ్దామని గురుకుల పాఠశాలకు వెళ్లగా, విద్యార్థి డార్మెటరీలో ఉన్నాడని చెప్పడంతో అక్కడకు వెళ్లి చూశాడు. అయితే అక్కడ ప్రవీణ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా తండ్రి షాక్ కు గురయ్యాడు. వెంటనే ప్రవీణ్ ను మదనాపురం పీహెచ్‌సీకి తరలించి.. అక్కడి నుంచి వనపర్తికి జిల్లా దవాఖానకు తీసుకెళ్లగా వైద్యులు బాలుడిని పరీక్షించి అప్పటికే అతడు మృతి చెందినట్టు వెల్లడించారు.
వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలికి చేరుకొని ఘటనపై వివరాలు సేకరించారు. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులను వెల్‌నెస్ సెంటర్ కుతీసుకెళ్లి పర్యవేక్షించాల్సిన సిబ్బంది.. అతడిని ఒంటరిగా డార్మెటరీలో విడిచిపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.