Food Safety Committees | రాష్ట్రంలోని గురుకులాలు, వసతిగృహాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు(Food Safety Committees) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS ShanthiKumari) తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆహారభద్రతపై ముగ్గురు సభ్యులతో కూడిన టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, విద్యాసంస్థ అధికారి, జిల్లాస్థాయి అధికారులు ఆ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. కాగా గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్ధిపేటలోని గురుకుల పాఠశాలలను తనిఖీ చేసి.. ఆహార పదార్థాలను, కనీస వసతులను స్వయంగా పరిశీలించారు. హాస్టళ్ల పర్యవేక్షణపై ప్రభుత్వం కమిటీలను నియమిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి ఏ కారణంతోనైనా అస్వస్థతకు గురైనా.. ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం హెచ్చరించారు.
Food Safety Committees : ఇటీవల పలు గురుకులు, సంక్షేమ వసతిగృహాల్లో పాఠశాల మధ్యాహ్న భోజనాల్లో ఫుడ్ పాయిజన్ జరిగి వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై హైకోర్టు (High Court) రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సైతం సీరియస్ అయ్యారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నాణ్యత పాటించాలని ఎన్నిసార్లు సూచించినా.. నాణ్యత లేని ఆహారం అందించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ బడులు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను తమ కన్నబిడ్డల్లా చూసుకోవాలని అధికారులకు సూచించారు. పౌష్టిక ఆహారం అందించే విషయం అలసత్వానికి తావు ఇవ్వొద్దని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తరచూ పాఠశాలలు, గురుకులాలను తనిఖీ చేయాలన్నారు. అలాగే.. మాగనూర్ ఘటనలో బాధ్యులైన వారిపై వేటు వేసి, వెంటనే నివేదికలను సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    