Soundale village : కొందరికి ఓ దురలవాటు ఉంటుంది. చీటికిమాటికి ఎవరిని పడితే వారిని తిట్టేస్తంటారు. విషయం చిన్నదైనా నోరు పారేసుకుంటారు. ఏది మాట్లాడినా తిట్లను ఊత పదంలా వాడుతుంటారు. నోరు తెరిస్తే అమ్మనా బూతులే (Foul Language). ఎంతో ఈజీగా ఒకరి తల్లిని, సోదరిని ఉద్దేశించి దూర్భాషలాటడమే వీరి పని. ఎవరి మీదైతే కోపం ఉంటుందో వారినే కాకుండా ‘నీ అమ్మ….,’ ‘నీ అక్క..’ అంటూ వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి కూడా పరుష పదజాలాన్ని వాడుతుంటారు. ఇలాంటి వారు సమాజంలో మన చుట్టూ అనేక మందే ఉంటారు. అయితే.. ఎవరెలా ఉన్నా తమ ఊరులో మాత్రం ఇలాంటి మనస్తత్వం గల మనుషులు ఉండొద్దని భావించారు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా సౌందాలకు చెందిన పలువురు గ్రామస్థులు. అక్కడి జనంలో మార్పును తీసుకురావడానికి ఓ వినూత్న కార్యాచరణకు పూనుకున్నారు. ఒకరి తల్లిని, సోదరిని ఉద్దేశించి ఎవరైనా తిడితే వారికి జరిమానా విధించాలని నిర్ణయించారు. దీనిపై గ్రామ పంచాయతీ ద్వారా ఏకగ్రీవ తీర్మానం కూడా చేయించారు.
Soundala యువకులు ఏముంటున్నారంటే..
సౌందాల 1,800 మంది జనాభా కలిగిన ఓ చిన్న గ్రామం. ఇక్కడ అక్షరాస్యుల సంఖ్య చాలా ఎక్కువ. కాస్తో కూస్తో చదువుకున్న వారు కొద్ది మందే ఉంటారు. ఒకరి తల్లిని, సోదరిని ఉద్దేశించి బూతులు తిట్టడం ఇక్కడ సర్వసాధారణం కాగా ఇలాంటి వారిలో మార్పును తీసుకురావడానికి గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్ని ఇస్తోందంటున్నారు ఇక్కడి యువకులు.
ఒకరి తల్లి మన తల్లిలాంటిదే కదా..
ఒకరి తల్లిని, సోదరిని ఉద్దేశించి తిడితే రూ. 500 జరిమానా కట్టాల్సిందేనంటూ గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి, దానికి సంబంధించిన పోస్టర్లను ఊరంతా అతికించారు. పంచాయతీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని, ఈ నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఊపేక్షించేది లేదని పేర్కొన్నారు. ‘ఒకరి తల్లిని, చెల్లిని ఒకరు తిట్టుకోవడం చాలా దుర్మార్గ చర్య. దీన్ని ఎలాగైనా ఆపాలని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని అన్నాడు సౌండాల గ్రామ వాసి మంగళ్ చామొటే. ఒకరి తల్లి, చెల్లి కూడా మన తల్లి, చెల్లి లాంటి వారే. అనవసరంగా వారిని ఉద్దేశించి పరుష పదజలాన్ని వాడటం అత్యంత దుర్మార్గమని భావించామని ఆయన తెలిపాడు. ‘మేం తీసుకున్న నిర్ణయంతో గ్రామ వాసుల్లో మార్పు వస్తోంది. జరిమానా భయంతో తిట్లను మానేస్తున్నారు’ అన్నాడు దినేశ్వర్ థోరట్.
ఊరంతా నిఘా నేత్రం
తిట్టే వారిపై జరిమానా విధిస్తున్నప్పటికీ అలాంటి వారిని గుర్తించడం కష్టమైన పని అని భావించింది సౌందాల గ్రామ పంచాయతీ పాలకవర్గం. తిట్టే వారిని గుర్తించేందుకు గ్రామమంతటా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఇవి విజ్యువల్స్‌నే కాకుండా ఆడియోను కూడా రికార్డు చేస్తాయని అంటున్నారు సర్పంచ్ శరద్ అర్గడే.
భావిపౌరుల కోసం..
గ్రామంలో ప్రతి ఒక్కరూ సభ్యత కలిగి, సఖ్యతతో మెలగడానికి ఇలాంటి చర్యలు తప్పనిసరి అని భావించింది సౌందాల గ్రామ పంచాయతీ. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారికి మంచి బుద్ధులు నేర్పేందుకు మొదట పెద్దల్లో మార్పు రావాలని ఈ వినూత్న చర్యలకు పూనుకుందని తెలుస్తోంది. అయితే.. తిట్ల విషయంలో తీసుకున్నట్లే ఈ పంచాయతీ మరో మంచి పద్ధతికి కూడా కార్యరూపం ఇచ్చింది. సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు పిల్లలు మొబైల్ ఫోన్ వాడొద్దని నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. సౌందాలలో ఇప్పుడు ఎక్కడా చూసిన బుద్ధిమంతులే కనిస్తున్నారు. ఆ గ్రామంలో వచ్చిన విప్లవాత్మక మార్పు యావత్ దేశానికే ఆదర్శనీయం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..