US California: : కాలిఫోర్నియాలో అత్యవసర పరిస్థితులు ఎదురవుతున్నాయి. బర్డ్‌ఫ్లూ అవియన్ ఇన్‌ఫ్లూయెంజా A (H5N1) వైరస్ విజృంభించింది. దీని ప్రభావంతో ఇప్పటికే చాలా మంది అనారోగ్య పాలయ్యారు. దీంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ మేరకు అక్కడి గవర్నర్ గావిన్ న్యూసమ్ ఈ రోజు వెల్లడించారు.
దక్షిణ కాలిఫోర్నియాలో కేసుల గుర్తింపు
severe bird flu : దక్షిణ కాలిఫోర్నియాలోని పాడి పశువుల ఫారాల్లో ఈ కేసులను గుర్తించినట్టు గవర్నర్ తెలిపారు. దీంతో ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తగిన చర్యలకు ఉపక్రమించామని వెల్లడించారు. గతంలో ఎన్నడూ కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి నుంచి మరొకరికి ఈ వైరస్ వ్యాపించలేదని, అయితే.. ఈ వైరస్ బారిపడిన బాధితుల్లో ఎక్కువగా మంది పాడి పశువులతో సంబంధం కలిగిన వారే ఉన్నారనే విషయాన్ని గుర్తించామని తెలిపారు.
California లో మార్చి నుంచే వైరస్ వ్యాప్తి
సీడీసీ (CDC) డేటా ప్రకారం.. మార్చి 2024లో టెక్సాస్, కాన్సాస్‌లో తొలి కేసులు నమోదైన తర్వాత H5N1 వైరస్ ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో పాడి పశువుల్లో వ్యాపించింది. ఏప్రిల్ నుంచి 61 మానవ H5N1 కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి. లూసియానాలో ఒకరు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.
జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు
ఈ అత్యవసర పరిస్థితి వల్ల కాలిఫోర్నియా ప్రభుత్వం వైరస్ నియంత్రణ చర్యలను మరింతగా ముమ్మరం చేసింది. దీని బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని యావత్ ప్రజానీకానికి సూచిస్తోంది. ప్రజల వైద్య పరీక్షలను విస్తృతం చేసింది. అవసరాన్నిబట్టి వైద్య సహాయం అందించేందుకు బృందాలను రంగంలోకి దింపింది. ఆస్పత్రుల్లో ప్రత్యేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది.
కాలిఫోర్నియా పాడి పశువుల ఫారాల్లోని కార్మికులకు అక్కడి ప్రభుత్వం రక్షణ సాధనాలను ముమ్మరంగా పంపిణీ చేస్తోంది. పాడి పశువుల కొట్టాల్లో పని చేసే వ్యక్తులు లేదా ముడి పాలు ఉపయోగించే వారు వీటిని ఉపయోగించాలని సూచించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..