Bhu Bharati : భూముల రికార్డులను పటిష్ట పర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు నడుం బిగించింది. భూములకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టింది. ధరణి స్థానంలో ‘భూ భారతి’ని రూపొందించి. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఆర్వోఆర్ (రివెన్యూ రికార్డులు) బిల్లులో అనేక కీలక అంశాలు ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
Bhu Bharati Bill కొత్త చట్టం లక్ష్యాలు
భూభారతి అనే కొత్త ఆర్వోఆర్ చట్టం ద్వారా పార్ట్-బీ కింద 18 లక్షల ఎకరాల భూముల సమస్యలకు పరిష్కారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ కంఠం భూములు, ఆబాదీ భూములకు సంపూర్ణ హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. చట్టంలోని తప్పుల పట్ల అప్పీల్‌కు కూడా అవకాశం కల్పించింది. ధరణిలోని 33 మాడ్యూల్స్‌తో పరిష్కరించలేని సమస్యలను భూ భారతిలో ఆరు మాడ్యూల్స్‌తో సులభతరం చేయనుంది.
వివాదాలకు తావులేకుండా…
బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 2020 ఆర్వోఆర్ చట్టంలోని లోపాలను సరిచేయడమే ‘భూ భారతి’ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ సర్కారు అంటోంది. ఈ చట్టం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలకు ఎటువంటి అవకాశం లేకుండా ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహిస్తామని చెప్పింది. గ్రామ కంఠం భూములకు, ఆబాదీ భూములకు సంపూర్ణ హక్కులు కల్పిస్తామని అంటోంది. మ్యుటేషన్‌లో పొరపాట్లు జరిగితే అప్పీల్ చేసుకునే విభాగాన్ని కూడా రూపొందించామని తెలిపింది.
మ్యుటేషన్ ప్రక్రియ
వంశపారంపర్య భూములు, సేల్డీడ్‌లతో పాటు మొత్తం 14 రకాల భూమి హక్కుల మ్యుటేషన్‌ను ఆర్డీవో అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. భూములకు భూ ఆధార్ నంబర్‌ను కేటాయిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
పరిష్కారానికి చర్యలు
2020 నవంబర్ 10 వరకు ఆన్‌లైన్‌లో వచ్చిన 9.24 లక్షల సాదా బైనామాల దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయించారు. భూ వివాదాలపై అర్జీలు, అప్పీళ్ల కోసం లాండ్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేశారు. రికార్డులలో ఉద్దేశపూర్వక మార్పులు చేసిన అధికారులను శిక్షించే అధికారం కొత్త చట్టంలో పొందుపరిచారు.
భూ భారతి ప్రత్యేకతలు
భూ భారతిలో పహాణీ కాలమ్స్‌ను సులభతరం చేశారు. ఈ కొత్త వ్యవస్థలో ఎవరైనా ఎక్కడి నుంచైనా భూముల సమాచారం తెలుసుకోవచ్చు. భూ భారతిలో దరఖాస్తు చేసుకున్న రైతుల మొబైల్ నంబర్లకు సమాచారం పంపే విధానాన్ని ప్రవేశపెట్టారు.
సర్కారు భూముల రక్షణ
సర్కారు భూములను ఆక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 2014కు ముందు ఉన్న రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ భూముల వివరాలను సమీక్షించి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
ధరణి లోపాలకు పరిష్కారం
ధరణి కారణంగా వచ్చిన సమస్యలను భూ భారతి ద్వారా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతుల కోసం సులభతరమైన మరియు పారదర్శకమైన భూ వ్యవస్థను అందించడమే ఈ చట్టం ఉద్దేశం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Bhu Bharati | కొత్త ఆర్వోఆర్ బిల్లు.. ‘భూ భారతి’ ప్రత్యేకతలివే..”