Digital Arrest : సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ ఆన్‌లైన్ అక్రమాలకు అడ్డుపడటం లేదు. నిరక్షరాస్యులే కుండా విద్యావంతులు ఈ క్రిమినల్స్ ట్రాప్‌లో పడుతూనే ఉన్నారు. అమాయకులేననికాకుండా ఈ తరహా అక్రమాలపై పూర్తి అవగాహన ఉన్నవారు సైతం అనివార్యంగా సైబర్‌నేరగాళ్లకు చిక్కుతున్నారు. హైదరాబాద్‌లో తాజాగా చోటుచేసుకున్న సంఘటనే దీనికి నిదర్శనం.
యువతిని నిర్బంధించి…
హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలో పనిచేసే ఉత్తర భారతానికి చెందిన ఓ యువతి డిజిటల్ అరెస్టు బారిన పడింది. సైబర్ నేరగాళ్లు ఆ యువతిని ఆన్‌లైన్‌లో నిర్బంధించి బ్లాక్‌మెయిల్ చేశారు. తనను మోసం చేయడానికే ఈ తతంగం నడుస్తోందని ఆమె గుర్తించినా ఏమీ చేయలేకపోయింది. అనివార్యంగా ఈ ఉచ్చుకు చిక్కింది. ఐటీ సెక్టార్‌లో పని చేస్తున్న ఆమె ఈ తరహా మోసంపై అవగాహన ఉన్నప్పటికీ నిస్సహాయ స్థితిలో ఈ దారుణానికి గురైంది.
కొన్ని రోజుల క్రితం ఓ అన్నౌన్ నంబర్‌తో ఆ యువతికి వీడియోకాల్ వచ్చింది. ఆన్‌లైన్‌లోకి వచ్చిన వ్యక్తులు తమను తాము పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. ఓ ఆర్థిక వ్యవహారంలో నువ్వు నేరస్థురాలివి అని, దీంతో డిజిటల్ అరెస్టు చేస్తున్నామని ఆ యువతిని బెదిరించారు. దీంతో ఆ వ్యక్తు ఆరోపణలను ఆమె వ్యతిరేకించింది. తానేమీ ఆర్థిక నేరానికి పాల్పడలేదని చెప్పింది. దీంతో ఆ వ్యక్తులు ఆమె కుటుంబ వివరాలు, ఆన్‌లైన్ చెల్లింపుల హిస్టరీ స్క్రీన్‌షాట్లతోపాటు ఎఫ్‌ఐఆర్ కాపీని వాట్సాప్ ద్వారా షేర్ చేశారు. ఈ నేరాన్ని ఒప్పుకోకపోతే మరిన్ని కఠినమైన కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు.
డబ్బులు కాజేసి వదిలేస్తారనుకుంటే…
తాను డిజిటల్ అరెస్టుకు గురైనట్టు గుర్తించిన ఆ యువతి నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడింది. ఈ క్రమంలో ఆ వ్యక్తులు ఈ కేసు నుంచి బయటపడేందుకు ఓ షరతును విధించారు. అదేమిటో చెప్పమని ఆ యువతి అడగ్గా ఆ వ్యక్తులు చెప్పిన సమాధానం విని ఆమె షాక్‌కు గురైంది. తన బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు కాజేస్తారేమోనని తొలుత భయపడిన ఆ యువతి… దానికి భిన్నంగా ఆ వ్యక్తులు చెప్పిన మాటలు విని ఒక్కసారిగా ఖంగుతింది. నిస్సహాయ స్థితిలో వారు చెప్పినట్టే చేసింది.
షరతులు విని షాక్
యువతిని డిజిటల్ అరెస్టు చేసిన వ్యక్తులు ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆన్‌లైన్‌లో తమ ఎదుట దుస్తులు తొలగించి నగ్నంగా మారాలని షరతు విధించారు. లేదంటే తమను తప్పించుకోలేవని బెదిరించారు. దీంతో ఆమె చేసేదేమీలేక వారు చెప్పినట్టే చేసింది. ఇదేక్రమంలో నేరగాళ్లు ఇంతటితో ఆగక ఆమె అకౌంట్‌లో ఉన్న డబ్బును కూడా దోచేశారు. ఈ ఘటనతో షాక్ నుంచి తేరుకోని ఆమె కొన్నిరోజుల తర్వాత పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Digital Arrest అంటే…
What is Digital Arrest : డిజిటల్ అరెస్టు అంటే ఒక ప్రత్యేకమైన సైబర్ నేరం. ఇందులో మోసగాళ్లు పోలీసు లేదా ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ బాధితులను భయాభ్రాంతులకు గురించి చేసి డబ్బులు వసూలు చేస్తారు. ఈ మోసాల్లో నేరగాళ్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాధితుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సేకరిస్తారు. దీనివల్ల వారు మరింత నమ్మకంగా కనిపిస్తారు. అందువల్ల బాధితులు తక్షణం వారి మాటలు నమ్మే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో బాధితులను నేరస్థులు ఎటూ కదలేని పరిస్థితులు కల్పిస్తారు. దీంతో బాధితులు వారి ఉచ్చులో పడి ఆర్థిక దోపిడీకి గురవుతారు. ఇలాంటి మోసాలకు అమాయకులే కాకుండా న్యాయవాదులు, ఐటీ ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేసేవారు అనేక మంది బలవుతున్నారు.
ఎలా జరుగుతుంది?
- మోసగాళ్లు ఒక వ్యక్తికి కాల్ చేసి, తమను పోలీసు లేదా ప్రభుత్వ అధికారి అని పరిచయం చేసుకుంటారు.
- మీపై ఫిర్యాదు ఉందని లేదా మీ పేరు నేర దర్యాప్తులో ఉందని భయపెడతారు.
- ఫేక్ ఎఫ్‌ఐఆర్‌లు, అరెస్టు వారెంట్లు లేదా ఇతర నేర సంబంధ పత్రాలను వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా పంపిస్తారు.
- బాధితుల కుటుంబ వివరాలు, ఆర్థిక లావాదేవీల చరిత్ర వంటి సమాచారాన్ని చూపించి మరింత భయపెడతారు.
- డబ్బులు చెల్లించమని లేదా అసభ్యకర చర్యలు చేయమని బెదిరిస్తారు. ఎలా నివారించాలి?
- ఎవరికీ మీ వ్యక్తిగత సమాచారాన్ని చెప్పొద్దు
- ఎవరి కాల్ వచ్చినా వారి గుర్తింపును ధృవీకరించాలి.
- ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు చేయాలి (సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు). డిజిటల్ అరెస్టు మోసం చాలా ప్రమాదకరమైనది. కానీ.. జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి తేలిగ్గా బయట పడొచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








